Tamilnadu: యూట్యూబర్‌పై మంత్రి పరువు నష్టం కేసు
- తమిళనాడు ప్రభుత్వాన్ని పడగొడతారంటూ మంత్రి సెంథిల్‌పై యూట్యూబర్ శంకర్ కామెంట్
- యూట్యూబర్ వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం
- తన పరువుకు భంగం కలిగించాడంటూ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు
- తాను ఇంతకాలం చేసిన ప్రజాసేవకు అతడి నిరాధార ఆరోపణలు మచ్చ తెచ్చాయని ఆవేదన
తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ.. యూట్యూబర్ సౌకు శంకర్ అలియాస్ ఏ.శంకర్‌పై చెన్నై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే లాగా తాను తమిళనాడు ప్రభుత్వాన్ని పడగొడతానంటూ శంకర్ తన యూట్యూబ్ ఛానల్లో అవాకులు చవాకులు మాట్లాడినట్టు సోమవారం కేసు దాఖలు చేశారు.
తన పరువు తీసేలా శంకర్ ట్విట్టర్లో నిరాధార ఆరోపణలు రాసుకొచ్చారని మంత్రి ఆరోపించారు. ఈ ఆరోపణలు తాను ఇంతకాలం పడ్డకష్టం, చేసిన ప్రజాసేవకు మచ్చ తెచ్చాయని వాపోయారు. ఐపీసీ సెక్షన్ 499, 500 కింద శంకర్‌ను శిక్షించాలని అభ్యర్థించారు.
కాగా, న్యాయవ్యవస్థపై విమర్శలు చేసిన కేసులో శంకర్ గతంలో ఓ మారు జైలుకెళ్లి వచ్చారు. 2022 జులైలో శంకర్ యూట్యూబ్ ఛానల్లో చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం అతడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. న్యాయవ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందన్న వ్యాఖ్యలకు గాను ఆయనకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.