Karnataka: సీఎం సీటు వారసత్వ ఆస్తి కాదు పంచుకోవడానికి.. డీకే శివకుమార్
- కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని సోనియా గాంధీకి మాటిచ్చి, నిలబెట్టుకున్నానన్న డీకే
- ఇప్పుడు ఏం చేయాలన్నది నిర్ణయించాల్సింది అధిష్ఠానమేనని వివరణ
- సీఎం పదవిపై ఢిల్లీలోనే చర్చిస్తామని మీడియాకు వెల్లడించిన డీకే
కర్ణాటకలో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. సీఎం కుర్చీ ఆశిస్తున్న ఇద్దరు నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లలో ఎవరిని ఎంపిక చేయాలా? అని పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయంపై ఢిల్లీలో జరుగుతున్న చర్చల కోసం డీకే శివకుమార్ మంగళవారం ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నర సంవత్సరాలు పంచుకోవాలన్న ప్రతిపాదనపై డీకే స్పందిస్తూ.. తాతల ఆస్తులను అన్నదమ్ములు పంచుకోవడం సహజమే కానీ సీఎం సీటు అలా వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు, దానిని పంచుకోలేమని చెప్పారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పదవిని మీరు అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు ఇప్పటి వరకైతే ఎలాంటి చర్చ జరగలేదని డీకే జవాబిచ్చారు.
సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ అంటూ సోమవారం చేసిన వ్యాఖ్యలతో డీకే రాజీ పడ్డారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీకి, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ప్రామిస్ చేశానని డీకే చెప్పారు. వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని, ఇప్పుడు ఏం చేయాలనేది నిర్ణయించాల్సింది వారేనని అన్నారు.
సిద్ధరామయ్యను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉందన్న వార్తలనూ డీకే ఖండించారు. అసలు ఈ నంబర్ల గొడవేమిటని ప్రశ్నిస్తూ.. పార్టీలో ఒకే ఒక నంబర్ ఉందని, అది 135 (రాష్ట్రంలో పార్టీ గెలుచుకున్న స్థానాలు) అని డీకే వివరించారు. డీకే శివకుమార్ వెంట ఉన్న ఓ ఎమ్మెల్యే స్పందిస్తూ.. సీఎం అభ్యర్థి ఎంపికకు సంబంధించి జరిగిన ఎమ్మెల్యేల ఓటింగ్ లెక్కలు తేలకముందే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వెంటే ఉన్నారని ఎలా చెబుతారని ప్రశ్నించారు.
వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చూస్తే సీఎం పదవికి సిద్ధరామయ్యే కరెక్ట్ అన్న వాదనను డీకే శివకుమార్ తోసిపుచ్చారు. వాళ్లు అలా కలలు కంటే కననివ్వండి.. వారి కలలను ఆపడానికి తానెవరినని అన్నారు. కర్ణాటక ప్రజలకు మంచి పాలన అందించాలన్నదే తన కల అని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మరింత పెంచాలని, మారుమూల ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీని విస్తరించాలని తాను కలలు కంటున్నానని డీకే వివరించారు. సీఎం పదవి విషయంలో ఇప్పటి వరకు చర్చలు జరగలేదని, దీనిపై ఢిల్లీలోనే చర్చిస్తామని డీకే శివకుమార్ చెప్పారు.