teacher: 18 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. యూపీలో టీచర్ అరెస్ట్
- కంప్యూటర్ బోధకుడి దారుణాలు
- ప్రాథమికోన్నత పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపులు
- పాఠశాల టాయిలెట్ల వద్ద వాడిపడేసిన కండోమ్ లు
- నిందితుడి అరెస్ట్.. కేసు నమోదు
విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు కోరుకోవాల్సిన ఓ టీచర్.. వారిపట్ల కామోన్మాదిగా మారిపోయాడు. 18 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ జిల్లాలో ఇది చోటు చేసుకుంది. పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడిన కంప్యూటర్ టీచర్ తోపాటు, అతడికి సహకారం అందించారన్న ఆరోపణలతో ఒక అసిస్టెంట్ టీచర్, ప్రిన్సిపాల్ మొత్తం ముగ్గురిపై పోక్సో, ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేశారు.
జిల్లాలోని తిల్హార్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ దారుణం జరిగినట్టు పోలీస్ సర్కిల్ ఆఫీసర్ ప్రియాంక్ జైన్ వెల్లడించారు. మహమ్మద్ అలీ అనే కంప్యూటర్ టీచర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడని, అతడికి ప్రిన్సిపాల్ అనిల్ పాఠక్, మరో అసిస్టెంట్ టీచర్ సాజియా సాయపడినట్టు తెలిపారు. తనను, ఇతర మహిళా విద్యార్థినులను కంప్యూటర్ టీచర్ అక్కడక్కడ తాకేవాడంటూ ఓ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది.
మరింత దారుణమైన విషయం ఏమిటంటే సదరు బాలిక తల్లిదండ్రులు, మరికొందరు విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి పాఠశాలపై దాడికి వెళ్లారు. టాయిలెట్ల వద్ద వాడేసిన కండోమ్ లు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. విద్యాశాఖ అధికారులు ప్రిన్సిపాల్, అసిస్టెంట్ టీచర్ ను సస్పెండ్ చేశారు. నిందితుడైన కంప్యూటర్ టీచర్ పై శాఖాపరమైన విచారణ మొదలు పెట్టారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన యూపీ మంత్రి బలదేవ్ సింగ్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.