banks: ఈ బ్యాంకుల్లో డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు

banks offer highest rates on fixed deposits

  • ఏడాది కాలానికి ఆకర్షణీయంగా 7.5 శాతం
  • రెండేళ్ల డిపాజిట్లపై 8 శాతం వడ్డీ రేటు
  • డీసీబీ, యస్ బ్యాంక్, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకుల్లో ఆఫర్లు

మనలో చాలా మంది స్వల్ప కాల అవసరాల కోసం నిధులను బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో పెట్టేస్తుంటాం. కానీ, ఆర్థికంగా ఇది మెరుగైన నిర్ణయం కాబోదు. ఎందుకంటే సేవింగ్స్ ఖాతాల్లో వడ్డీ రేటు కేవలం 3 శాతం లేదా 3.5 శాతం మించి రాదు. కానీ, ద్రవ్యోల్బణం రేటు 5.5-6 శాతంగా ఉంటున్న నేపథ్యంలో సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో ఉంచితే మన డబ్బు విలువ ఏడాది కాలంలో నికరంగా 3 శాతం వరకు నష్టపోయినట్టు అవుతుంది. అందుకని ద్రవ్యోల్బణానికి మించి రాబడినిచ్చే సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడే మన డబ్బు విలువ వృద్ధి చెందుతుంది. కనుక ఏడాదికి 6 శాతానికి మించి వడ్డీ రేటున్న సాధనాలను ఎంపిక చేసుకోవాలి.

అందరికీ తెలిసిన, సులభంగా అందుబాటులో ఉండే ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఇప్పుడు కొన్ని బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. గతేడాది మే నుంచి ఆర్ బీఐ ఇప్పటి వరకు 2.5 శాతం వరకు వడ్డీ రేట్లను పెంచింది. ఇది డిపాజిట్లు, రుణాలపై రేట్లు పెరిగేందుకు దారితీసింది. దీంతో ఇప్పుడు కొన్ని బ్యాంకుల్లో ఏడాది కాల డిపాజిట్ రేట్లు ఆకర్షణీయంగా మారాయి.

ఏడాది కాలానికి యస్ బ్యాంక్ 7.5 శాతం రేటును ఎఫ్ డీపై ఆఫర్ చేస్తోంది. ఇండస్ ఇండ్ బ్యాంకు సైతం ఇదే రేటును ఇస్తోంది. బంధన్ బ్యాంక్ 7.25 శాతం రేటును, డీసీబీ బ్యాంక్ 7.25 శాతం రేటును ఆఫర్ చేస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, కెనరా బ్యాంక్ 7.1 శాతం రేటు ఇస్తుంటే, ఆర్ బీఎల్ బ్యాంక్ 7 శాతం రేటును ఇస్తోంది. 

ఇక రెండేళ్ల కాల పరిమితి డిపాజిట్లపై డీసీబీ బ్యాంక్ 8 శాతం రేటును ఆఫర్ చేస్తోంది. రెండేళ్ల కాలానికి అత్యధిక రేటును ఆఫర్ చేస్తున్న బ్యాంక్ ఇదొక్కటే. ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్ సైతం రెండేళ్ల డిపాజిట్లపై 7.75 శాతం రేటును ఇస్తున్నాయి. బంధన్ బ్యాంక్ 7.25 శాతం, యాక్సిస్ బ్యాంక్ 7.10 శాతం రేటును ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకుల్లో ఒక్కో డిపాజిటర్ కు రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంటుంది. కనుక బ్యాంక్ వైఫల్యం పాలైనా రూ.5 లక్షల వరకు భరోసా ఉంటుంది.

  • Loading...

More Telugu News