YS Avinash Reddy: అవినాశ్ రెడ్డికి మళ్లీ నోటీసులిచ్చిన సీబీఐ.. 19న విచారణకు రావాలని ఆదేశం!
- ఈ రోజు విచారణకు రాలేనని సీబీఐకి అవినాశ్ రెడ్డి లేఖ
- నాలుగు రోజులు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన సీబీఐ అధికారులు
- శుక్రవారం ఉదయం 11 గంటలకు రావాలని సూచన
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ రోజు విచారణకు రాలేనంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి రాసిన లేఖపై సీబీఐ స్పందించింది. ఈ నెల 19న తమ ముందు హాజరుకావాలంటూ అధికారులు మరోసారి నోటీసులిచ్చారు. హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాశ్ రెడ్డి బయల్దేరగా.. దారి మధ్యలో ఉండగా వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సూచించారు.
వివేకా హత్య కేసు విచారణకు హాజరుకావాలంటూ ఎంపీ అవినాశ్ రెడ్డికి సోమవారం సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సీబీఐకి లేఖ రాసిన అవినాశ్ రెడ్డి.. అత్యవసర పనుల కారణంగానే విచారణకు రాలేకపోతున్నానని చెప్పారు. నాలుగు రోజుల గడువు కావాలని కోరారు.