Sharmila: ఈ కుంభకోణంపై సీఎం కేసీఆర్ నేటికీ స్పందించకపోవడం దుర్మార్గం: షర్మిల
- టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ఐటీ శాఖ నిర్లక్ష్యం ఫలితమేనన్న షర్మిల
- మంత్రి కేటీఆర్ దీనికి బాధ్యత వహించాలని డిమాండ్
- మళ్లీ పేపర్లు లీక్ కావన్న గ్యారంటీ ఇవ్వడంలేదని ఆగ్రహం
టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కారుపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకులు ఐటీ శాఖ నిర్లక్ష్యం ఫలితంగానే చోటు చేసుకున్నాయని, మంత్రి కేటీఆర్ దీనికి బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై సీఎం కేసీఆర్ నేటికీ స్పందించకపోవడం దుర్మార్గం అని షర్మిల విమర్శించారు.
నిరుద్యోగుల బతుకులు ఆగమవుతున్నా, మళ్లీ పేపర్లు లీక్ కావన్న గ్యారంటీ ఇవ్వడంలేదని మండిపడ్డారు. పాత బోర్డుతోనే పరీక్షలు జరిపి నిరుద్యోగులను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
నిరుద్యోగులకు భరోసా కలిగేలా, ఉద్యోగాలు భర్తీ అయ్యేలా వైఎస్సార్టీపీ తయారుచేసిన అఫిడవిట్ పై కేసీఆర్ సంతకం పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు.