Rahul Gandhi: ప్రధాని పర్యటన కన్నా ముందు అమెరికాకు రాహుల్ టూర్!

Rahul Gandhi to visit USA on May 31 for 10 days

  • మే 31న అమెరికా పర్యటనకు వెళ్తున్న రాహుల్ గాంధీ
  • జూన్ 4న న్యూయార్క్‌లోని మేడిసన్ స్వ్కేర్ గార్డెన్‌లో ర్యాలీ
  • స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించనున్న కాంగ్రెస్ నేత
  • పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలను కలుసుకునే అవకాశం
  • జూన్ 22న అమెరికాకు వెళ్తున్న ప్రధాని మోదీ 

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మే 31న అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. పది రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. జూన్ 4న న్యూయార్క్‌లోని మేడిసన్ స్వ్కేర్ గార్డెన్‌లో జరిగే ర్యాలీలో సుమారు 5,000 మంది ఎన్ఆర్ఐలు పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. 

రాహుల్ తన పర్యటనలో వాషింగ్టన్, కాలిఫోర్నియాలో జరిగే ప్యానల్ డిస్కషన్‌లో పాల్గొంటారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. అలాగే పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలను కలుసుకుంటారు. 

రాహుల్ గత మార్చిలో లండన్ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో మాట్లాడటం, ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడం తెలిసిందే. భారత ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని, తనతో సహా పలువురు రాజకీయ నేతలపై నిఘా ఉంటోందని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రాహుల్ విదేశాల్లో కించపరచేలా మాట్లాడారని, విదేశీ శక్తుల జోక్యాన్ని కోరారని బీజేపీ తప్పుపట్టింది. రాహుల్ క్షమాపణ చెప్పాలనే డిమాండ్ చేసింది.

అయితే తాను విదేశాల జోక్యాన్ని కోరాననడం పూర్తి అబద్ధమని, వాస్తవాలను వక్రీకరించారని రాహుల్ చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని తాను కించపరచలేదని, బీజేపీ నేతలే అనేక సార్లు విదేశీ పర్యటనల్లో ‘భారతదేశం దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు’ అంటూ దేశ ప్రతిష్టను దిగజార్చే వ్యాఖ్యలు చేశారని అన్నారు.

మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 22న అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌ వైట్‌హౌస్‌లో ఇచ్చే విందు కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు కొన్ని రోజుల ముందు రాహుల్ అమెరికాకు వెళ్తుండటం చర్చనీయాంశమవుతోంది.

  • Loading...

More Telugu News