CPI Ramakrishna: సిసోడియాకు ఓ రూలు.. జగన్‌కు మరో రూలా?: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna Fires on PM Narendra Modi

  • మద్యం కుంభకోణంలో జగన్ నెలకు రూ. 100 కోట్లు సంపాదిస్తున్నారన్న రామకృష్ణ
  • మోదీ, జగన్ ఇద్దరూ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం
  • గతంలో ఎప్పుడూ ఇలాంటి రాజకీయాలు చూడలేదన్న సీపీఐ నేత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం విక్రయాల్లో నెలకు రూ. 100 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం జగన్ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వ్యవస్థలను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను మోదీ ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పుతూ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఆప్’ మంత్రి మనీశ్ సిసోడియాను రూ. 100 కోట్ల మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేసి 50 రోజులుగా జైలులోనే ఉంచడం మోదీ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. జగన్ మాత్రం మద్యంలో నెలకు రూ.100 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తనకు అనుకూలంగా ఉన్న జగన్‌కు ఓ రూలు, ప్రతిపక్షంలో ఉన్న సిసోడియాకు మరో రూలా? అని మోదీని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులపై ఇలాంటి కక్ష సాధింపు ధోరణిని గతంలో ఎప్పుడూ చూడలేదని రామకృష్ణ అన్నారు.

  • Loading...

More Telugu News