Sedentary Lifestyle: బద్ధకం.. పొగతాగడంకన్నా డేంజరట!
- రోజులో ఎక్కువ సమయం కూర్చుంటే దీర్ఘకాలంలో ముప్పు
- హృద్రోగ సమస్యలు పెరుగుతాయంటున్న వైద్య నిపుణులు
- ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ అవసరమేనని సూచన
రోజంతా బద్ధకంగా గడిపేయడం కూడా దీర్ఘకాలంలో శరీరానికి చేటు చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులో ఎక్కువ కాలం కూర్చోవడం సిగరెట్ తాగడంతో సమానమని అంటున్నారు. ఓ సిగరెట్ తాగడం వల్ల శరీరానికి ఎంత హాని కలుగుతుందో.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా అంతే నష్టం కలుగుతుందని చెబుతున్నారు.
బద్ధకంతో కూడిన జీవనశైలి కారణంగా వయసు పైబడుతున్న కొద్దీ గుండెపోటు, మధుమేహంతో పాటు మానసిక అనారోగ్యాలకు గురయ్యే రిస్క్ ఎక్కువ అవుతుందని చెప్పారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో కేన్సర్ బారిన పడే అవకాశమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. రోజువారీ జీవితంలో చురుగ్గా ఉన్నపుడే మన శరీరంలోని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయని, ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా శ్రమ పడటం తప్పనిసరి అని నిపుణులు వెల్లడించారు.
ఎక్కువ సమయం కూర్చుంటే..
- శరీరంలో రక్తప్రసరణ వేగం నెమ్మదిస్తుంది. రక్తనాళాలలో ఫ్యాటీ యాసిడ్లు పేరుకుపోతాయి
- కొవ్వును కరిగించే శారీరక సామర్థ్యం తగ్గిపోతుంది
- ఇన్సులిన్ నిరోధకత పెరిగి మధుమేహానికి, స్థూలకాయానికి కారణమవుతుంది
- ఎముకలు, కండరాలు బలహీనంగా మారుతాయి
- మెదడు పనితీరుపైనా ప్రభావం పడుతుంది
రోజంతా బద్ధకంగా గడిపేస్తుంటే..
- జీర్ణ వ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు, చక్కెర స్థాయులు పెరిగిపోయి స్థూలకాయులుగా మారిపోతారు.
- శారీరకంగా ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం 45 నుంచి 50 నిమిషాల పాటు వ్యాయామం చేయడం తప్పనిసరి అని వైద్యుల సూచన.
- పొద్దస్తమానం సోమరిగా గడపడం వల్ల యాంక్జైటీ, డిప్రెషన్ తో బాధపడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- రోజులో ఎక్కువకాలం కూర్చుని గడుపుతుంటే దీర్ఘకాలంలో ఊపిరితిత్తులు, మూత్రాశయం, పేగులకు సంబంధించిన కేన్సర్ల ముప్పు పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలిందట.
- ఎక్కువ సమయం టీవీ ముందు కూర్చుని గడిపేసే వారికి హృద్రోగ సమస్యల రిస్క్ ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.