cheif minister: విజయవాడలో అఖండ పూర్ణాహుతికి హాజరైన సీఎం జగన్
- ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజుల యాగం పరిపూర్ణం
- మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతుల నిర్వహణ
- వేద పండితులను సత్కరించిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విజయవాడలో రాజశ్యామల అమ్మవారు వేంచేసి ఉన్న వైఖానస యాగశాలలో శ్రీలక్ష్మీ మహా యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి తానేటి వనిత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి పండితులతో కలసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. మైసూరు దత్తపీఠాధిపతి, అవధూత గణపతి సచ్చిదానంద స్వామీజీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 9.20 గంటలకు యాగశాలలో విశేష పూజలు ముగిశాయి. అనంతరం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి రుత్విక్కులు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులను ముఖ్యమంత్రి సత్కరించారు.