Mega IPO: ఒకప్పటి క్రేజీ ఇప్పుడేదీ? ఏడాది దాటినా కోలుకోని ఎల్ఐసీ షేరు..! 

Mega IPO mega loss LIC investors suffer 2 lakh crore shock in 1 year

  • ఏడాది కాలంలో పడడమే కానీ, నిలదొక్కుకోని షేరు
  • ఇష్యూ ధరపై 38 శాతం తక్కువలో ట్రేడ్
  • వాటాలు పెంచుకుంటున్న రిటైల్ ఇన్వెస్టర్లు

భారత ఈక్విటీ మార్కెట్ లో ఎల్ఐసీ లిస్టింగ్ ను గేమ్ చేంజర్ గా అభివర్ణించారు. రూ.21,000 కోట్ల సమీకరణతో భారత ఐపీవో చరిత్రలో అతి పెద్ద ఇష్యూగా రికార్డుల్లోకి ఎక్కింది. బీమా పరిశ్రమ దిగ్గజంగా అభివర్ణించారు నిపుణులు. తిరుగులేని మార్కెట్ వాటా ఎల్ఐసీ సొంతమన్నారు. అనలిస్టులు ఇలా రకరకాల విశ్లేషణలు చెప్పారు. దీర్ఘకాలం కోసం సబ్ స్క్రయిబ్ చేసుకోవాలని సూచించారు. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐపీవో ఇష్యూ ధరపై రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీదారులకు అదనపు డిస్కౌంట్ కూడా ఇచ్చారు.  

అసలు ఇష్యూ ధర రూ.949. దీనిపై రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 డిస్కౌంట్, పాలసీదారులకు రూ.60 డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ పోను రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరు రూ.904, పాలసీదారులకు రూ.889 పడింది. 2022 మే 17న లిస్ట్ అయింది. రూ.920 గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఇక అంతే.. ఆ తర్వాత తిరిగి ఆ ధరను ఇంత వరకు చేరుకోలేకపోయింది. అక్కడి నుంచి రూ.530 వరకు పడిపోయింది. ప్రస్తుతం రూ.568 వద్ద ట్రేడ్ అవుతోంది. సుమారు 38 శాతం తక్కువకే ఎల్ఐసీ షేరు ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు మార్కెట్ విలువ పరంగా రూ.2.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. గత ఏడాది కాలంలో నష్టాలు తెచ్చి పెట్టిన బ్లూ చిప్ స్టాక్స్ లో ఇదీ ఒకటి. 

మార్చి క్వార్టర్ లో మ్యూచువల్ ఫండ్స్ ఎల్ఐసీలో తమ వాటాను కొంత మేర అమ్మేశాయి. ఎఫ్ఐఐలు సైతం వాటాలు తగ్గించుకున్నారు. మంచి చౌక బేరమూ అన్నట్టు రిటైల్ ఇన్వెస్టర్లు తమ వాటాని 1.92 శాతం నుంచి 2.04 శాతానికి పెంచుకున్నారు. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇప్పటికీ దీర్ఘకాలం కోసం ఈ షేరును సిఫారసు చేస్తోంది. కాకపోతే పరుగులు పెట్టేంత లాభాలను ఆశించొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News