Delhi Capitals: పాపం పంజాబ్.. ప్లే ఆఫ్స్ ఆశలను చిదిమేసిన ఢిల్లీ!

Delhi Crushes Punjab Play Off hopes

  • లివింగ్ స్టోన్ పోరాడినా దక్కని ఫలితం
  • 15 పరుగులతో పంజాబ్‌ను చిత్తు చేసిన ఢిల్లీ
  • పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడిన రోసౌ

ప్లే ఆఫ్స్ రేసు నుంచి బయటకు వచ్చేసిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు.. పంజాబ్ కింగ్స్ ఆశలను కూడా చిదిమేసింది. ధర్మశాలలో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో విజయం సాధించిన వార్నర్ సేన.. పంజాబ్‌కు కోలుకోలేని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు రెండు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.

లియాం లివింగ్ స్టోన్ వీర విజృంభణ చేసి జట్టులో ఆశలు రేకెత్తించినప్పటికీ సాధించాల్సిన పరుగులకు, ఉన్న బంతులకు మధ్య అంతరం బాగా పెరిగిపోవడంతో ఓటమి తప్పలేదు. లివింగ్ స్టోన్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 94 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి అవుటయ్యాడు. అథర్వ టైడే 42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేయగా, ప్రభుసిమ్రన్ సింగ్ 22 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, అన్రిక్ నోకియా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 

అంతకుముందు రోసౌ వీర విజృంభణతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన రోసౌ 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. పృథ్వీషా 38 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌‌తో 54 పరుగులు చేయగా, కెప్టెన్ వార్నర్ 46, సాల్ట్ 26 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో శామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టాడు. రోసౌకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

వరుస పరాజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఢిల్లీకి ఇది ఊరటనిచ్చే విజయమే. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఢిల్లీ ఈ గెలుపుతో కింది నుంచి రెండో స్థానానికి చేరుకుంది. ఆ జట్టుకు ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగా, 10 పాయింట్లు ఉన్నాయి. ఇక, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చతికిలపడిన పంజాబ్ కింది నుంచి మూడో స్థానానికి పరిమితమైంది. ఆ జట్టుకు ఇంకో మ్యాచ్ మిగిలి ఉంది. అందులో గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.

  • Loading...

More Telugu News