IMD: నైరుతి రుతుపవనాలు ఏపీని తాకేది ఎప్పుడంటే..!
- ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా కేరళకు రాక
- జూన్ 15న రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం
- ఈసారి సాధారణ వర్షపాతమేనని వాతావరణ శాఖ అంచనా
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక మూడు రోజులు ఆలస్యం కానుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఏటా జూన్ 1న కేరళను తాకనున్న రుతుపవనాలు ఈసారి జూన్ 4న ప్రవేశిస్తాయని తెలిపింది. అదేవిధంగా ఏపీలోకి జూన్ 15న రుతుపవనాలు ప్రవేశిస్తాయని వివరించింది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాల రాకకు సూచనగా మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ నెల 22 నాటికి అండమాన్ నికోబార్ దీవులలో రుతుపవనాలు విస్తరిస్తాయని చెప్పారు.
జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైనా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు చెప్పారు. కేరళను తాకిన పది రోజుల్లో రాయలసీమ మీదుగా ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అన్నారు. వారం రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వివరించారు. అయితే, ఈసారి కూడా ఏపీలో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని అధికారులు అంచనా వేశారు. కాగా, కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.