Lok Sabha: పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాజీపడ్డాను!: డీకే శివకుమార్
- పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచించానని చెప్పిన డీకే
- ఖర్గే, రాహుల్ గాంధీ, ఆ కుటుంబం చెప్పినట్లు విన్నానన్న కర్ణాటక కాంగ్రెస్ చీఫ్
- సీఎంగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకేను ప్రకటించిన కాంగ్రెస్
పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తాను రాజీపడ్డానని కర్ణాటక కాబోయే ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటక ప్రజలకు మా నిబద్ధత నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయని, కాబట్టి తమ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి, ఆయన కుటుంబానికి తలవంచాల్సిందే అన్నారు. పార్టీ ప్రయోజనాల కోసమే తాను అంగీకారం తెలిపానన్నారు. కర్ణాటక ప్రజలకు మేం ఎంతో చేయాల్సింది ఉందని అభిప్రాయపడ్డారు.
పార్టీ శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్రానికి కొత్త ఉపముఖ్యమంత్రిగా ఉండాలన్న పార్టీ హైకమాండ్ నిర్ణయానికి తాను అంగీకరించినట్లు తెలిపారు. నాలుగు రోజుల అనిశ్చితి తర్వాత, కాంగ్రెస్ సీఎంగా సిద్ధరామయ్యను, ఉప ముఖ్యమంత్రిగా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ శివకుమార్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. సీఎం, డిప్యూటీలపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్నారు.
224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీకి 66 సీట్లు మాత్రమే లభించాయి. జనతాదళ్-సెక్యులర్ 19 సీట్లు గెలుచుకుంది.