Jogi Ramesh: జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదు: ఏపీ మంత్రి జోగి రమేశ్

Jogi Ramesh fires at Chandrababu and Pawan Kalyan

  • పేదలంటే చంద్రబాబుకు అహంకారమన్న మంత్రి జోగి 
  • పేదల ఇళ్లను సమాధులని సంబోధిస్తారా అని నిలదీత
  • టీడీపీని రాజకీయంగా పాతరేస్తారని హెచ్చరిక
  • ఇళ్లు కట్టివ్వడంపై చంద్రబాబుకు జోగి రమేశ్ సవాల్
  • అమరావతిలో పేదలు ఉండొద్దా? అని నిలదీత
  • పవన్ పార్టీ పెట్టిందే బాబు కోసమని ఎద్దేవా 

ఇళ్ల పట్టాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు అహంకారపూరితమని ఏపీ మంత్రి జోగి రమేశ్ గురువారం ధ్వజమెత్తారు. పేదల ఇళ్లను సమాధులని సంబోధించడం దుర్మార్గం అన్నారు. ఓట్లు వేయడానికి మాత్రమే పేదలు కావాలా? రాజధానిలో పేదలు ఉండవద్దా? అని ప్రశ్నించారు. చంద్రబాబును, టీడీపీని రాజకీయంగా పాతరేస్తారని హెచ్చరించారు. ఇళ్ల పట్టాలపై జగన్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందన్నారు. గురువారం ఆయన మీడియాతో బాబుపై విరుచుకుపడ్డారు.

చంద్రబాబుకు సవాల్


జగన్ మనసున్న ముఖ్యమంత్రి అనీ, అందుకే ఆయన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టారనీ అన్నారు. ఇంటి నిర్మాణం కోసం ఒక్కో సెంట్ భూమిని ఇస్తే అది సరిపోతుందా.. అక్కడ సమాధి కట్టుకోవాలని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదని, ముప్పై లక్షలమంది అక్కా చెల్లెళ్లకు ఇళ్లను కూడా నిర్మించి ఇస్తున్నట్లు చెప్పారు.  17005 జగనన్న కాలనీలు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయన్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో తాను చంద్రబాబుకు ఓ సవాల్ చేస్తున్నానని, 1995 నుండి 2019 వరకు పాతికేళ్లలో చంద్రబాబు 14 ఏళ్లు ఏపీకి సీఎంగా ఉన్నాడని, అలాగే విభజిత ఏపీలో 2014 నుండి 2019 వరకు సీఎంగా ఉన్నారని, ఈ కాలంలో ఒక్క సెంట్ భూమిని పేదవారికి ఇచ్చాడేమో చెప్పాలని నిలదీశారు. పైగా తాము ఇస్తుంటే సమాధి కట్టుకోవడానికి కూడా సరిపోదని ఆయన నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై అక్కాచెల్లెళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఆయనను నిట్టనిలువునా సమాధి చేయబోతున్నారన్నారు.

పేదల పట్ల ఇంత అహంకారమా?

పేదవాళ్లను చూస్తే చంద్రబాబుకు ఇంత అహంకారమా అని మంత్రి ప్రశ్నించారు. అంతకుముందు మురికి వాడల్లో ఎవరు జీవిస్తారని సంబోధించారని, అలాగే ఎస్సీలలో ఎవరు పుట్టాలని అనుకుంటారని వ్యాఖ్యానించారని, బీసీల తోకలు కత్తిరిస్తానని వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఓట్లు వేయడానికి మాత్రమే ఎస్సీ, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారా? అని మండిపడ్డారు. వీరి ఓట్లతోనే.... మా వర్గాల అక్కాచెల్లెళ్లతో ఓట్లతోనే గతంలో అధికారంలో ఉన్న నీకు, ఇప్పుడు వారికి ఇళ్లు ఇస్తే కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ఆయనకు సెంటున్నర భూమి ఇవ్వడం చేతకాదని, కానీ ఈ రోజు జగన్ ఇస్తుంటే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

అమరావతిలో పేదలు ఉండవద్దా అని నిలదీత

అమరావతి రాజధాని అయితే అక్కడ పేదవారు ఉండవద్దా అని ప్రశ్నించారు. బీసీలుగా, ఎస్సీలుగా, మైనార్టీలుగా మేం అక్కడ నివసించేందుకు అర్హులం కాదని చెబుతున్నారా అన్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని నిరుపేద అక్కాచెల్లెళ్లకు ఇళ్లు ఇవ్వాలని జగన్ శ్రీకారం చుడితే, సుప్రీం కోర్టు మెట్టు ఎక్కుతారా అని విమర్శించారు. పేదలకు, పెత్తందారులకు జరుగుతున్న ఈ యుద్ధంలో.. పేదల పక్షాన నిలబడ్డ జగన్ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించిందన్నారు. పేదల కోసం మేం ఇళ్లు కడుతుంటే, చంద్రబాబు మాత్రం పెత్తందారుల పక్షాన నిలబడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలందరూ చంద్రబాబును పాతరేస్తారని హెచ్చరించారు. టీడీపీని మరోసారి నిలువునా పాతిపెట్టేందుకు పేదవర్గాలు ఏకతాటిపై ఉన్నారని వ్యాఖ్యానించారు.

జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేదు.. పవన్ పార్టీ పెట్టిందే బాబు కోసం

జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఆయన చేతగాని, చవట, సన్నాసి అన్నారు. ఏరా బాబు చంద్రబాబు.. చవటసన్నాసి అంటూ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ వంటి వీరుడ్ని, ధీశాలిని ఒంటరిగా ఎదుర్కోలేక పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారన్నారు. సీఎం పీఠం కోసం పొత్తు కోసం చూస్తున్నారన్నారు. చంద్రబాబు ఓ రకంగా మాట్లాడితే ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్.. నేను చవటను, నేను సన్నాసిని, నాకు చేతకాదు.. నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు.. నేను చంద్రబాబు చంక నాకుతాను, నేను చంద్రబాబు చంక ఎక్కుతాను.. నేను చంద్రబాబు కాళ్లు పట్టుకుంటాను.. నేను పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసం.. నేను సీఎం అభ్యర్థిని కాదు అని తెగేసి చెప్పారన్నారు. అలాంటప్పుడు ఎవరు గెలిచినట్లు అని విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News