Virat Kohli: క్లాస్ సెంచరీతో క్రిస్‌గేల్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ
- గేల్ పేరిట ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీల రికార్డు
- ఆరో సెంచరీతో విండీస్ దిగ్గజం సరసన కోహ్లీ
- తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విరాట్ విశ్వరూపం
ఐపీఎల్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో కోహ్లీకి ఇది ఆరో సెంచరీ. ఫలితంగా ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ సరసన చేరాడు. గేల్ 142 మ్యాచుల్లో ఆరు శతకాలు నమోదు చేయగా, కోహ్లీ 237వ మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు.
2016 సీజనల్‌లో నాలుగు సెంచరీలు, 7 సెంచరీలతో మొత్తంగా 973 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసిన కోహ్లీ మూడేళ్ల తర్వాత 2019లో మరో సెంచరీ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మరో శతకంతో మెరిశాడు. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్ ఇప్పటి వరకు ఆరు అర్ధ సెంచరీలు బాదాడు.
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నిన్న చెలరేగి ఆడిన కోహ్లీ సెంచరీతో జట్టును నాలుగో స్థానంలో నిలిపాడు. ఎల్లుండి (21న) గుజరాత్ టైటాన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో కనుక బెంగళూరు విజయం సాధిస్తే ఇతర జట్ల సమీకరణాలతో పనిలేకుండా నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.