USA: గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల పాటు ఎదురుచూపులకు కారణం ఇదే..!
- కార్డుల జారీపై దేశాలవారీగా ఉన్న పరిమితే జాప్యానికి కారణమన్న యూఎస్సీఐఎస్ శాఖ అధికారి
- డిమాండ్ కంటే కార్డుల సరఫరా తక్కువగా ఉందని వ్యాఖ్య
- పరిమితిని ఎత్తేసే అధికారం అమెరికా చట్టసభలకు మాత్రమే ఉందని వెల్లడి
అమెరికాలో శాశ్వత నివాసార్హత కల్పించే గ్రీన్ కార్డు సొంతం చేసుకోవడం ఎందరో భారతీయుల కల. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కల నెరవేరేందుకు దశాబ్దాల పాటు ఎదురు చూడాల్సిందే. గ్రీన్ కార్డుల జారీపై దేశాలవారీగా అమలవుతున్న పరిమితే ఈ పరిస్థితికి కారణమని అమెరికా పౌరసత్వం, వలస సేవల శాఖ (యూఎస్సీఐఎస్) సీనియర్ సలహాదారు డగ్లస్ రాండ్ తాజాగా పేర్కొన్నారు. ఏటా జారీ చేసే గ్రీన్ కార్డులపై అమెరికా చట్టసభలు పరిమితి విధించాయని ఆయన చెప్పుకొచ్చారు. ఏటా 2,26,000 ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్ కార్డులు, 1,40,000 ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులు మాత్రమే జారీ చేసే అవకాశం ఉందని వివరించారు. ఇక గ్రీన్ కార్డులపై దేశాలవారీగా కూడా పరిమితి ఉందని చెప్పారు.
‘‘మొత్తం వీసాల్లో ఒక దేశానికి ఏడు శాతం మాత్రమే జారీ చేయాలి. దీనర్థం భారత్, చైనా, మెక్సికో దేశాలకు ఏటా 25,620 గ్రీన్ కార్డులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆయా దేశాల ప్రజలు సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే డిమాండ్, సరఫరా మధ్య అంతరం కారణంగానే జాప్యం జరుగుతోంది. గ్రీన్ కార్డుల జారీపై అమెరికా పరిమితి విధించింది. కానీ, డిమాండ్ మాత్రం నిరంతరంగా పెరుగుతోంది. ఒక్క ఇండియా మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది’’ అని డగ్లస్ తెలిపారు. వీసా, దౌత్య సేవల సంబంధిత అంశాలపై అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల ఎన్నారైల కోసం ఏర్పాచేసిన సమావేశంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు.