Janasena: ఆ దుర్ఘటనకు నేటికి 18 నెలలు, ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్ కల్యాణ్
- అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మాణంపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేన అధినేత
- ఏడాదిలో డ్యామ్ ఆయకట్టుదారుల ప్రయోజనాలను రక్షిస్తామని ప్రభుత్వం చెప్పిందన్న పవన్
- 18 నెలలైనా ఏ ఒక్క పని చేయలేదని విమర్శ
2021లో సంభవించిన భారీ వర్షం, వరదల వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్ ని తిరిగి పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 18 నెలలు గడిచినా ఏ ఒక్క పని కూడా చేయలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ విషయమై ఆయన వరుస ట్వీట్లతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.
‘19.11.2021 తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు డ్యాం యొక్క మట్టికట్ట తెగిపోయింది. హఠాత్తుగా సంభవించిన ఈ వరద కారణంగా నది ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపటూరు, గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జలసమాధి అయ్యారు. ప్రమాద ఘటన వెంటనే చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హైలెవెల్ కమిటీ వేస్తున్నాము, ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం అసెంబ్లీలో ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో, ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.
అన్నమయ్య డ్యామ్ ని తిరిగి పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారని పవన్ గుర్తు చేశారు. ‘దుర్ఘటన జరిగి ఈ రోజుతో 18 నెలలు. ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక కనీసం ఈరోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదు. ఈ 18 నెలలలో చేసింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని 660 కోట్లకు అప్పచెప్పారు’ అని పవన్ ఆరోపించారు. అప్పట్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి శకావత్ రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారని, అంతర్జాతీయంగా ఈ ఘటనపై గనక అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుందని వాపోయారని జనసేన అధినేత పేర్కొన్నారు.