Narendra Modi: ఈ నెల 28న ప్రారంభమవుతున్న కొత్త పార్లమెంట్ భవనం ప్రత్యేకతలు ఇవే!

PM Modi to inaugurate the new Parliament building on May 28

  • 2020 డిసెంబర్ 10న భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాని
  • రికార్డు సమయంలోనే నిర్మాణం పూర్తి
  • ప్రతిపక్షాలను మాట్లాడనివ్వనప్పుడు కొత్త భవనం ఎందుకంటున్న కాంగ్రెస్

దేశ రాజధాని న్యూఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28న ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధానమంత్రిని మార్యాదపూర్వకంగా కలుసుకుని ఈ నూతన భవనాన్ని ప్రారంభించాలని ఆహ్వానించారు. 1927లో నిర్మించిన ప్రస్తుత పార్లమెంటు భవనం 100 ఏళ్లు పూర్తిచేసుకోనుంది. ఈ భవనంలో ప్రస్తుత అవసరాలకు తగినంత స్థలం కొరవడడంతో నూతన పార్లమెంటు భవనం నిర్మాణం చేపట్టవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ.. లోక్ సభ, రాజ్యసభలు ఒక తీర్మానం ఆమోదించాయి. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 డిసెంబర్ 10న నూతన భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  రికార్డు సమయంలోనే నూతన భవన నిర్మాణం పూర్తయింది. కొత్త పార్లమెంటు భవనంలో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. 

ప్రస్తుత పార్లమెంట్ భవనంలో లోక్ సభలో 543 మంది, రాజ్యసభలో 250 మంది కూర్చోవడానికి సదుపాయం ఉంది. కాగా, నూతన భవనంలో లోక్ సభలో 888 మంది, రాజ్యసభలో 300 మంది ఎంపీలు కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. సంయుక్త పార్లమెంటు సమావేశం లోక్ సభలోనే జరుగుతుంది. అంటే 1280 మంది ఎంపీలు ఒకేసారి కూర్చునే వసతి లోక్ సభలో ఉంది. అయితే, కొత్త పార్లమెంట్ భవనంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పెదవి విరిచింది. ఇది ప్రధాని మోదీ గర్వాన్ని పెంచుకునేందుకు నిర్మించిన భవనం అంటూ విమర్శించింది. చట్ట సభల్లో చర్చ జరపకుండా, ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వనప్పుడు కొత్త భవనం ఎందుకని ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News