Sugar: చక్కెర.. ఉప్పు.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదకరం?

Sugar vs Salt What impacts your heart health more

  • చక్కెర మోతాదు ఎక్కువ అయితే కాలేయం, గుండెపై ప్రభావం
  • ఉప్పు ఎక్కువైతే కిడ్నీలు, గుండెపై అధిక పని భారం
  • ఈ రెండింటితోనూ దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు

చక్కెర, ఉప్పు. ఈ రెండు పదార్థాలూ రుచులకు కీలకం. కొందరు ఉప్పు, కారాన్ని ఎక్కువగా ఇష్డపడతారు. కొందరు తీపి పట్ల మక్కువ చూపిస్తారు. కానీ, ఈ రెండూ కూడా నేటి జీవన శైలి వ్యాధులకు కారణమవుతున్న వాటిల్లో ప్రధానమైనవి. మితంగా తీసుకుంటే ఫర్వాలేదు. కానీ, మితిమీరితే వీటి అనర్థాలను స్వయంగా అనుభవించాల్సి వస్తుంది. చక్కెర, ఉప్పుతో బీపీ, గుండె జబ్బులు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, అధిక బరువు తదితర ఎన్నో సమస్యలు వస్తాయని చాలా ఏళ్లుగా ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. 

చక్కెర
ప్రాసెస్డ్ షుగర్ తో పోలిస్తే సహజమైన చక్కెరతో అనర్థాలు తక్కువ. కృత్రిమ స్వీటనర్లు, ప్రాసెస్డ్ షుగర్ తో అనర్థం ఎక్కువ. సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, కుకీలు, క్యాండీలు, కేక్ లు వీటన్నింటిలో ఉండేది ప్రాసెస్డ్ చక్కెరే. విడిగా కలుపుకునే లేదా ప్రాసెస్డ్ చక్కెర కలిసిన పదార్థాల రూపంలో రోజువారీ 21 శాతం వరకు కేలరీలు భర్తీ చేసుకునే వారు, అలా తీసుకోని వారితో పోలిస్తే గుండె జబ్బుతో మరణించే అవకాశాలు ఎక్కువని ఓ అధ్యయనం చెబుతోంది. కనుక అదనంగా జోడించుకునే చక్కెరతో గుండెకు హాని చేసుకున్నట్టుగానే భావించాలి. ఆహారంలో అధిక చక్కెరని కాలేయమే ప్రాసెస్ చేయాలి. దీన్ని కాలేయం ఫ్యాట్ గా మారుస్తుంది. ఇది ఎక్కువ పేరుకుంటే ఫ్యాటీ లివర్, స్థూలకాయం, గుండె జబ్బులకు దారితీస్తుంది. అధిక చక్కెర వినియోగించడం వల్ల శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ కూడా పెరిగిపోతుంది. ఇది రక్తపోటు, గుండె జబ్బులు, కేన్సర్ కు దారితీయవచ్చు.

ఉప్పు
కూరల్లో ఉప్పు లేకుంటే రుచే తెలియదు. కాకపోతే కూరలకు తోడు, కొందరు స్నాక్స్ కూడా తీసుకుంటారు. అన్నంలో చిప్స్ తీసుకుంటారు. ఇవి కూడా ఉప్పు ఎక్కువగా వేసి చేసేవి. వీటన్నింటి వల్ల రోజువారీ అధిక ఉప్పు శరీరంలోకి చేరిపోతుంది. భారతీయ ఆహార ప్రమాణాల సంస్థ నిర్వచనం ప్రకారం రోజువారీ సోడియం (ఉప్పు) వినియోగం 5 గ్రాముల్లోపే ఉండాలి. వైద్యులు అయితే 2-3 గ్రాములు మించకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. బ్రెడ్, పిజ్జా, సూప్ లు, స్నాక్స్, చీజ్, ఆమ్లెట్ తదితర పదార్థాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. సోడియం మన శరీరంలో ఎక్కువ అయితే అప్పుడు అధిక నీరు నిల్వ ఉండిపోతుంది. ఎందుకంటే అధిక నీటి వల్ల ఉప్పు సాంద్రత తగ్గుతుంది. 

మరి నీటి పరిమాణం పెరిగిపోవడం వల్ల మన శరీరంలో రక్త పరిమాణం (వ్యాల్యూమ్) కూడా పెరుగుతుంది. దీంతో గుండెపై భారం పడుతుంది. రక్తపోటు అధికమవుతుంది. ఆర్టరీలు, కిడ్నీలపైనా భారం పడుతుంది. ఉప్పు తీసుకోవడం బాగా తగ్గినా ప్రమాదమే. కనుక రోజువారీ 2-3 గ్రాములు మించకుండా చూసుకోవాలి. ఏమైనా, చక్కెర, ఉప్పులో ఒకటి నయం అని చెప్పడానికి లేదు. రోజువారీగా పరిమితి మించకుండా తీసుకుంటే ప్రమాదం ఉండదు. లేదంటే దీర్ఘకాలంలో గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు కొనితెచ్చుకున్నట్టు అవుతుంది.

  • Loading...

More Telugu News