Sunil Gavaskar: అతడికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు: గవాస్కర్ తీవ్ర విమర్శలు
- జోఫ్రా ఆర్చర్ కు ఈసీబీ కంటే ముంబయి ఇండియన్స్ నే ఎక్కువ చెల్లిస్తోందన్న గవాస్కర్
- ఫిట్ నెస్ గురించి ఫ్రాంచైజీకి తెలియజేయలేదని విమర్శ
- చికిత్స పేరుతో స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడని వ్యాఖ్య
- ఎంత పేరున్న ఆటగాడైనా.. లీగ్ మొత్తం ఉండకపోతే రూపాయి కూడా చెల్లించకూడదని సూచన
- ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఆడాలా? తన దేశం కోసం ఆడాలా? అనేది అతడి ఇష్టమని ఘాటు వ్యాఖ్యలు
ఐపీఎల్ వేలంలో విదేశీ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే.. ఏవేవో సాకులు చెప్పి సీజన్ మధ్యలోనే వెళ్లిపోతున్నారు. తమకు గాయాలైన విషయాలను, ఫిట్ నెస్ లేదనే విషయాలను దాచిపెట్టి.. లీగ్ లో పాల్గొంటున్నారు. కోట్లకు కోట్లు తీసుకుంటూ ఫ్రాంచైజీలను మోసం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాడు.. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జోఫ్రా ఆర్చర్ పై ఇండియన్ క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ తీవ్ర విమర్శలు చేశారు. అతడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదని స్పష్టం చేశారు. కోట్లకు కోట్లు ఖర్చు పెడితే అతడు ముంబయికి ప్రతిఫలంగా ఏమిచ్చాడని ప్రశ్నించారు.
‘‘జోఫ్రా ఆర్చర్ వల్ల ముంబయి ఇండియన్స్ ఎలాంటి అనుభవం చవిచూసిందో తెలుసు కదా. అతను గాయపడ్డాడని, ఈ సీజన్ నుంచి మాత్రమే అందుబాటులో ఉంటాడని తెలిసి కూడా అతడిని కొనుగోలు చేసింది. ఆర్చర్ కోసం పెద్ద మొత్తంలో చెల్లించింది. బదులుగా అతడు ఏమి ఇచ్చాడు? అతను కనీసం 100 శాతం ఫిట్‌గా కూడా అనిపించలేదు’’ అని తీవ్ర విమర్శలు చేశారు.
‘‘అతను తన ఫిట్ నెస్ గురించి ఫ్రాంచైజీకి తెలియజేయాల్సింది. సాధారణ వేగంతో కూడా బౌలింగ్ చేయలేకపోయాడు. టోర్నమెంట్ మధ్యలో.. చికిత్స కోసం విదేశాలకు వెళ్లాడు. ఈ విషయాన్ని ఈసీబీనే స్పష్టంగా చెప్పింది. అంటే అతను ఎప్పుడూ పూర్తిగా ఫిట్‌గా లేడు’’ అని చెప్పారు.
‘‘అతడికి ఈసీబీ కంటే ముంబయి ఇండియన్స్ నే ఎక్కువ డబ్బు చెల్లిస్తోంది. కానీ అతడు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించాడు. అతడు ఆడకపోయినా.. ఫ్రాంచైజీ కోసం టోర్నమెంట్ ముగిసే దాకా ఇక్కడ ఉండాల్సింది. కానీ అతడు ఇంగ్లండ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడంతోనే ఫ్రాంచైజీ విషయంలో ఉన్న నిబద్ధత ఎలాంటిదో అర్థమైంది’’ అని ‘మిడ్ డే’ పత్రికకు రాసిన వ్యాసంలో గవాస్కర్ పేర్కొన్నారు.
‘‘ఎంత పెద్ద పేరున్న ఆటగాడైనా సరే.. అతను మొత్తం టోర్నమెంట్‌కు అందుబాటులో ఉండకపోతే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఆడాలా? తన దేశం కోసం ఆడాలా? అనేది అతడి ఇష్టం. అతను తన దేశాన్ని ఎంచుకుంటే మంచిదే. కానీ దేశాన్ని కాదని ఐపీఎల్‌లో ఆడాలని నిర్ణయించుకుంటే మాత్రం.. అతను పూర్తి నిబద్ధతను చూపెట్టాలి. సాకులు చెప్పి, ముందే వెళ్లిపోకూడదు. ముఖ్యంగా ప్లేఆఫ్స్ కు కీలకంగా మారిన సమయంలో’’ అని గవాస్కర్ రాసుకొచ్చారు.