Rajasthan Royals: పంజాబ్ కింగ్స్ ను ఇంటికి పంపిన రాజస్థాన్ రాయల్స్... కానీ!
- ఐపీఎల్ తాజా సీజన్ లో తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడేసిన పంజాబ్, రాజస్థాన్
- 4 వికెట్ల తేడాతో నెగ్గిన రాజస్థాన్ రాయల్స్
- ప్లే ఆఫ్ ఆశలు సజీవం
- ఇతర మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడిన రాజస్థాన్ భవితవ్యం
- టోర్నీ నుంచి నిష్క్రమించిన పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ తాజా సీజన్ లో మరో ఉత్కంఠ భరిత మ్యాచ్ ఆవిష్కృతమైంది. ధర్మశాలలో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. అయితే, రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మన్ ధృవ్ జురెల్ ఓ స్ట్రెయిట్ సిక్స్ తో పంజాబ్ ఓటమిని ఖరారు చేశాడు.
ఈ మ్యాచ్ లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. 188 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాజస్థాన్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 50, దేవదత్ పడిక్కల్ 51, షిమ్రోన్ హెట్మెయర్ 46, రియాన్ పరాగ్ 20 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో రబాడా 2, శామ్ కరన్ 1, అర్షదీప్ 1, నాథన్ ఎల్లిస్ 1, రాహుల్ చహర్ 1 వికెట్ తీశారు.
ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా నిలిచాయి. పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ రెండు జట్లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో గెలుపు కోసం హోరాహోరీ పోరాడాయి.
రాజస్థాన్ రాయల్స్ మెరుగైన రన్ రేట్ కోసం దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ఆర్సీబీని వెనక్కి నెట్టాలంటే రాజస్థాన్ నేటి మ్యాచ్ ను 18.3 ఓవర్లలోనే గెలవాల్సి ఉండగా, ఆ విషయంలో రాజస్థాన్ విఫలమైంది. ఇక, రాజస్థాన్ ప్లే ఆఫ్ దశకు చేరాలంటే ఇతర మ్యాచ్ ల ఫలితాలు కూడా అనుకూలించాల్సి ఉంది.