Monsoon: వడివడిగా తరలివస్తున్న రుతుపవనాలు
- శుక్రవారం నాటికి నికోబార్ దీవులకు చేరిన రుతుపవనాలు
- జూన్ 4న కేరళను తాకే అవకాశం
- తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఆవరించిన ద్రోణి
- ఫలితంగా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు
- కొనసాగుతున్న ఎండలు, నల్గొండ జిల్లా దామచర్లల్లో 45.5 డిగ్రీల సెల్సీయస్ గరిష్ఠ ఉష్ణోగ్రత
నైరుతి రుతుపవనాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా ప్రకటన ప్రకారం, శుక్రవారం నాటికి రుతుపవనాలు నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్‌లోని కొన్ని ప్రాంతాల వరకూ చేరుకున్నాయి. ఇదే వేగం కొనసాగితే జూన్ నాలుగో తేదీకి కేరళను తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా ఉత్తర కర్ణాటక వరకూ ద్రోణి విస్తరించి ఉంది. వాయవ్య వైపు నుంచి రాష్ట్రం దిశగా దిగువస్థాయి గాలులు కూడా వీస్తుండడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
శుక్రవారం రాష్ట్రం భానుడి భగభగలతో అట్టుడికింది. నల్గొండ జిల్లా దామచర్లలో అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లా వీణవంకలో 45.4 , నిర్మల్ జిల్లా కడెం పెద్దూరులో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో 44 నుంచి 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి .