Supreme Court: పాత విద్యుత్ బిల్లులను కొత్త యజమానుల నుంచి వసూలు చేయచ్చు: సుప్రీంకోర్టు
- విద్యుత్ బకాయిలపై దాఖలయిన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
- పాత యజమానుల బకాయిలను ప్రాంగణాల కొత్త యజమానులు కట్టాలని స్పష్టీకరణ
- 2003 విద్యుత్ చట్టం, 1948 నాటి చట్టం, ఎలెక్ట్రిసిటీ సప్లై కోడ్ ఇందుకు వీలు కల్పిస్తున్నాయని వివరణ
విద్యుత్ బకాయిలకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా ప్రాంగణంలో విద్యుత్ బకాయిలను దాన్ని కొత్తగా కొనుగోలు చేసిన వారి నుంచి వసూలు చేయచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హీమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. పాత యజమానులు విద్యుత్ బిల్లు చెల్లించలేదన్న కారణంగా తమ నివాస ప్రాంగణాలకు విద్యుత్ నిలిపివేశారంటూ కేరళకు కెందిన 19 మంది సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ మేరకు తీర్పు వెలువడింది.
2003 విద్యుత్ చట్టం సెక్షన్ 43 ప్రకారం విద్యుత్ సరఫరా అనేది పంపిణీ సంస్థలు నిర్దేశించిన ఛార్జీలు, నియమనిబంధనలకు లోబడి ఉంటుందని, విద్యుత్ సరఫరా చేయడం తప్పనిసరి కాదని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇక 1948 నాటి చట్టంలోని సెక్షన్ 49 ప్రకారం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు పాత బకాయిలను కొత్త యజమాని చెల్లించడం తప్పనిసరి అని కూడా పేర్కొంది. ఇవి వసూలు చేసుకునేందుకు విద్యుత్ సంస్థలకు ఎలెక్ట్రిసిటీ సప్లైకోడ్ వీలు కల్పిస్తోందని తెలిపింది.