RBI: రూ.2 వేల నోటును మార్చుకోవడం ఎలా..?
- బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి పరిమితి లేదు
- మార్చుకోవాలంటే ఒక్కసారి పది నోట్లకే అవకాశం
- బ్యాంకింగేతర సంస్థలలో రోజుకు 2 నోట్లు మాత్రమే!
క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోటును చలామణిలో నుంచి తప్పిస్తున్నట్లు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోటును మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ అవకాశం ఇచ్చింది. ఆ గడువు ముగిసిన తర్వాత కూడా రూ.2 వేల నోటుకు లీగల్ టెండెన్సీ (చట్టబద్ధమైన చెల్లుబాటు) ఉంటుందని ప్రకటించింది. పెద్ద నోటును చలామణిలో నుంచి మాత్రమే తప్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 23 నుంచి బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చని వివరించింది.
రూ.2 వేల నోటును ఎలా మార్చుకోవచ్చంటే..
తమ ఖాతా ఉన్న బ్యాంకులో రూ.2 వేల నోట్లు ఎన్నైనా సరే డిపాజిట్ చేసుకోవచ్చు. నోట్ల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. డిపాజిట్ చేసుకోవడం కాకుండా నోట్లు మాత్రమే మార్చుకోవాలని అనుకునే వారు దగ్గర్లోని ఏ బ్యాంకు బ్రాంచికైనా వెళ్లి రూ.2 వేల నోట్లు ఇచ్చి చిల్లర తీసుకోవచ్చు. అయితే, ఇలా మార్చుకోవడానికి ఆర్బీఐ పరిమితి విధించింది. ఒక వ్యక్తి, ఒక ట్రాన్సాక్షన్ లో రూ.20 వేల వరకు.. అంటే పది పెద్ద నోట్లను మాత్రమే మార్చుకోవచ్చని చెప్పింది.
బ్యాంకులు లేని చోట్ల బ్యాంకింగ్ సేవలందించే సంస్థలను సంప్రదించి రూ.2 వేల నోటును మార్చుకోవచ్చు. అయితే, ఒకరోజులో 2 నోట్లను మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్బీఐ సదరు సంస్థలకు పరిమితి విధించింది. బ్యాంకుల్లో కానీ, బ్యాంకింగేతర సంస్థల్లో కానీ రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.