Andhra Pradesh: అనకాపల్లి బెల్లానికి పూర్వవైభవం తీసుకొస్తా: చంద్రబాబు
- టీడీపీ అధినేతకు బెల్లంతో చేసిన గజమాలతో సత్కారం
- బెల్లం రైతులను విజిలెన్స్ కేసులతో వేధించారన్న చంద్రబాబు
- చెరకు సాగు 80 వేల ఎకరాల నుంచి 32 వేల ఎకరాలకు తగ్గిందని వెల్లడి
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అనకాపల్లికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెల్లం వ్యాపారులు ఘనంగా స్వాగతం పలికారు. బెల్లంతో తయారుచేసిన గజమాలతో బాబును సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బెల్లం మార్కెట్ లో అనకాపల్లి మార్కెట్ నెంబర్ వన్ గా ఉండేదని చెప్పారు. గతంలో 80 వేల ఎకరాల్లో చెరకు పంట వేసి రైతులు బెల్లం ఉత్పత్తి చేసేవారని వివరించారు.
జగన్ సర్కారు రైతులను వేధింపులకు గురిచేయడం, విజిలెన్స్ కేసులు పెట్టి వేధించడంతో చెరకు పండించడం మానేశారని అన్నారు. చెరకు సాగు 80 వేల ఎకరాల నుంచి 32 వేల ఎకరాలకు తగ్గిపోయిందని చంద్రబాబు చెప్పారు. చెరకుకు టన్నుకు రూ.3,200 ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక బెల్లం మార్కెట్ కు పునర్వైభవం తీసుకొస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.