G20 Meeting: కశ్మీర్ లో జీ20 సదస్సుపై చైనా అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన ఇండియా!
- మా భూభాగంలో ఎక్కడైనా నిర్వహిస్తామని చైనాకు స్పష్టం చేసిన కేంద్రం
- సరిహద్దుల్లో శాంతి నెలకొన్నప్పుడే ఇరుదేశాల మధ్య సత్సంబంధాలని వ్యాఖ్య
- జీ 20 సదస్సుకు ఇంకా రిజిస్టర్ చేసుకోని తుర్కియే, సౌదీ అరేబియా
శ్రీనగర్ లో ఈ నెల 22 నుంచి 24 వరకు జరగనున్న జీ 20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ సమావేశాల సందర్భంగా కశ్మీర్ లో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసింది. అయితే, జీ 20 సదస్సును కశ్మీర్ లో నిర్వహించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ మాట్లాడుతూ.. జీ 20 వంటి అంతర్జాతీయ సదస్సును కశ్మీర్ లాంటి వివాదాస్పద ప్రాంతంలో నిర్వహించడం సరికాదనీ, దీనికి నిరసనగా చైనా ఈ సమావేశాలకు హాజరుకాబోదని చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ చైనాకు కౌంటర్ ఇచ్చింది.
ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక సదస్సును నిర్వహించే అవకాశం భారత్ కు దక్కిందని, ఈ సదస్సును తమ భూభాగంలో ఎక్కడైనా నిర్వహించుకునే స్వేచ్ఛ తమకు ఉందని స్పష్టం చేసింది. దేశ సరిహద్దుల్లో శాంతి నెలకొన్నప్పుడే చైనాతో సంబంధాలు సాధారణంగా ఉంటాయని తేల్చిచెప్పింది. సదస్సు కోసం వచ్చే ప్రతినిధుల భద్రతను దృష్టిలో పెట్టుకుని శ్రీనగర్ లో సెక్యూరిటీ పెంచినట్లు వివరించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తో పాటు పారామిలటరీ బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. కాగా, ఈ సదస్సులో పాల్గొనేందుకు చైనా విముఖత వ్యక్తం చేసింది. తుర్కియే, సౌదీ అరేబియా ఇప్పటి వరకూ రిజిస్టర్ చేసుకోలేదని అధికారులు వివరించారు.