RBI: పాత నోట్ల రద్దు, 2 వేల నోటు వాపస్.. రెండింటి మధ్య తేడా ఏంటంటే!
- పాతనోట్లు ఎకాఎకిన రద్దయిపోగా.. రూ.2 వేల నోటును క్రమపద్ధతిలో తప్పిస్తున్న ఆర్బీఐ
- సెప్టెంబర్ 30 వరకు రూ.2 వేల నోటుకు లీగల్ గా చెల్లుబాటు
- పెరగనున్న బ్యాంకు, ఏటీఎం ట్రాన్సాక్షన్లు
మార్కెట్లో నుంచి రూ.2 వేల నోటును వాపస్ తీసుకుంటున్నట్లు ఆర్బీఐ చేసిన ప్రకటన 2016లో నోట్ల రద్దు నిర్ణయాన్ని గుర్తుకు తెస్తోంది. అయితే, 2 వేల నోటు చలామణిని ఆపేస్తున్నట్లు ఆర్బీఐ చేసిన ప్రకటన, నోట్ల రద్దు నిర్ణయం రెండూ వేర్వేరు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన మరుక్షణం నుంచి పాత వెయ్యి, 500 నోట్లు చెల్లకుండా పోయాయి.
చట్టబద్ధంగా వాటికి ఎలాంటి విలువ లేకుండా పోయిందని చెప్పారు. మార్కెట్లో ఎవరూ వాటిని అంగీకరించలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం రూ.2 వేల నోటు సెప్టెంబర్ 30 వరకు లీగల్ గా చెల్లుబాటు అవుతుందని అన్నారు. ఈ గడువు లోపల రూ.2 వేల నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చని, బయట కూడా ఉపయోగించుకోవచ్చని వివరించారు. సెప్టెంబర్ 30 తర్వాత మాత్రం మార్కెట్లో ఎవరూ తీసుకోరని నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్లో నుంచి రూ.2 వేల నోటు చలామణిని ఆర్బీఐ క్రమక్రమంగా తప్పించింది. పాత నోట్లను మాత్రం ఒకేసారి రద్దు చేసింది. 2016 నవంబర్ 8న పాత నోట్ల రద్దు నిర్ణయం వెలువడ్డాక ప్రజలతో పాటు బ్యాంకులకూ ఇబ్బంది తప్పలేదు. అయితే, రూ.2 వేల నోటును చలామణిలో నుంచి తప్పించడంతో బ్యాంకర్లకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పెద్ద నోటు అందుబాటులో ఉండదు కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్లు పెరుగుతాయని, ఏటీఎం ట్రాన్సాక్షన్లు కూడా పెరుగుతాయని వివరించారు.