Telcom companies: ఆదాయం పెంచుకునేందుకు టెలికం కంపెనీల ఎత్తుగడలు
- ప్లాన్ గడువు ముగిసిన వెంటనే సేవలు బంద్
- రీచార్జ్ చేసుకుంటేనే తిరిగి సేవల పునరుద్ధరణ
- ఎక్స్ పైరీ తర్వాత డేటా టాపప్ లపై పరిమితులు
- యూజర్ నుంచి సగటు ఆదాయం పెంచుకునే వ్యూహాలు
టెలికం కంపెనీలకు ఆదాయ దాహం తగ్గలేదు. ఒక్కో యూజర్ నుంచి వీలైనంత ఆదాయం రాబట్టుకునేందుకు అవి ఎన్నో రకాల ఆలోచనలు చేస్తున్నాయి. ఒక్కోటీ అమల్లో పెడుతున్నాయి. టారిఫ్ లను వెంట వెంటనే పెంచడానికి వెసులుబాటు ఉండదు. అలా చేస్తే వినియోగం తగ్గొచ్చు లేదా కస్టమర్లను కోల్పోవచ్చు. నియంత్రణ సంస్థ నుంచి ఇబ్బందులు కూడా ఎదురుకావచ్చు. అందుకని టెలికం కంపెనీలు ఏడాదికోసారి టారిఫ్ లు పెంచుతూ వెళుతున్నాయి. మధ్యే మార్గంలో ఇతర చర్యలను కూడా అమలు చేస్తున్నాయి.
చివరిగా 2021 నవంబర్ లో టెలికం కంపెనీలు టారిఫ్ లను పెద్ద ఎత్తున పెంచాయి. ప్రస్తుతం అంటే మార్చి చివరికి ఎయిర్ టెల్ కు ఒక్కో యూజర్ నుంచి సగటున రూ.193 వస్తోంది. జియోకి రూ.178.80 వస్తోంది. మధ్యకాలానికి రూ.300కు చేరితేనే కంపెనీలు మనుగడ సాగించగలవని ఎయిర్ టెల్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. కనుక టెలికం యూజర్లు భవిష్యత్తులో మరింత ఖర్చు చేసేందుకు సిద్ధం కాక తప్పేలా లేదు.