Raghu Rama Krishna Raju: అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీపై కేంద్రానికి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు
- అమరావతిలో ఏపీ సర్కారు ఇళ్ల స్థలాల పంపిణీ
- ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందన్న రఘురామ
- ఏపీ ప్రభుత్వానికి నిధులు నిలిపివేయాలని విజ్ఞప్తి
- టిడ్కో ఇళ్లను పంపిణీ చేసేలా జగన్ ను ఆదేశించాలంటూ లేఖ
ఏపీ రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ స్కీం కింద ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ పథకం కింద ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం సరికాదని రఘురామ వివరించారు. ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసిన నిధులను తక్షణమే నిలుపుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఏపీ సీఎం జగన్ కు అమరావతి అంటే ద్వేషభావం ఉందని, రాజధానిని విశాఖకు తరలిస్తున్నామని ఆయన పలు వేదికలపై ప్రకటించారని రఘురామ తన లేఖలో ప్రస్తావించారు. కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి సాయపడవద్దని రఘురామ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న 30 లక్షల టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించేలా సీఎం జగన్ ను ఆదేశించాలని కోరారు.