MK Stalin: రూ.2000 నోటు రద్దుపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందన
- దేశంలో రూ.2 వేల నోట్లు వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటన
- కర్ణాటక ఓటమి నుంచి దృష్టి మరల్చేందుకే ఈ నిర్ణయమన్న స్టాలిన్
- నోట్ల రద్దు చేసినప్పుడల్లా ప్రధాని జపాన్ వెళతారని ఖర్గే సెటైర్
- చదువుకోని వ్యక్తి ప్రధాని అయితే ఇలాగే ఉంటుందన్న కేజ్రీవాల్
- 100 కోట్ల భారతీయులకు బిలియన్ డాలర్ల మోసం అంటూ మమత వ్యాఖ్యలు
దేశంలో రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిన్న ప్రకటించడం తెలిసిందే. ఈ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఈ నిర్ణయంపై తీవ్రస్థాయిలో స్పందించారు.
కర్ణాటకలో ఎదురైన పరాభవాన్ని దాచిపెట్టడానికి ఇదొక ఉపాయం అంటూ స్టాలిన్ ట్వీట్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో పరాజయం నుంచి దృష్టి మరల్చే ప్రయత్నమని పేర్కొన్నారు. 500 సందేహాలు, 1000 రహస్యాలు, 2000 తప్పులు అంటూ చురక అంటించారు.
అటు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సైతం కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇలా నోట్ల రద్దు చేయాల్సి వచ్చినప్పుడే మోదీ జపాన్ పర్యటన పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ఆ నిర్ణయం దేశానికి ఉపయోగకరమో, వినాశకరమో మోదీకి తెలిసే అవకాశం ఉండదని విమర్శించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.2000 నోటు రద్దుపై ఘాటుగా స్పందించారు. ఏ దేశానికైనా చదువుకున్న వ్యక్తి ప్రధానిగా ఉండాలని, చదువుకోని వ్యక్తి ప్రధానమంత్రిగా ఉంటే అందరికీ ఇబ్బందులేనని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నాడు రూ.2 వేల నోటును తీసుకువచ్చిన తర్వాత అవినీతి ఆగిపోయిందన్నారని, ఇప్పుడదే నోటును రద్దు చేస్తూ అవినీతికి అడ్డుకట్ట పడుతుందని చెబుతున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ అంశంపై వ్యాఖ్యానించారు. నాడు నోట్ల రద్దు సమయంలో ప్రజలు పడిన బాధలు ఎవరూ మర్చిపోలేదని, ఆ బాధలకు కారణమైన వ్యక్తులను క్షమించకూడదని పేర్కొన్నారు. 100 కోట్ల మంది భారతీయులకు బిలియన్ డాలర్ల మోసం అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.