Ntr: తెలుగు సినిమా వైభవాన్ని చాటిన మహనీయుడు ఎన్టీఆర్: చరణ్
- ఎన్టీ రామారావు శతజయంతి వేడుకల్లో చరణ్
- ఆయనతో తనకి గల పరిచయం గురించి ప్రస్తావన
- ఆయన పనిచేసిన ఇండస్ట్రీలో ఉండటం గర్వకారణమని వెల్లడి
- తెలుగు సినిమా వైభవాన్ని చాటిన మహనీయుడని వ్యాఖ్య
ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలకు హైదరాబాద్ వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన పలువురు ప్రముఖులు ఆయనతో తమకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. ఎన్టీ రామారావు గురించి చరణ్ మాట్లాడుతూ .. "ఏ స్థాయిని గురించి మాట్లాడదామనుకున్నా, ఆ స్థాయికి అందని వ్యక్తి రామారావుగారు" అని అన్నారు.
"తెలుగు ప్రజలకు రాముడన్నా .. కృష్ణుడన్నా రామారావుగారే. వారు సాధించిన విజయాలను గురించిన ఆలోచన చేస్తూ, వారు వేసిన దారుల్లో నడుస్తూ ఆయనను గుర్తుచేసుకున్నప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాకి గుర్తింపును .. గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావుగారు. అలాంటి వ్యక్తి పనిచేసిన ఇండస్ట్రీలో మనం పనిచేస్తుండటం కంటే గర్వకారణం మరొకటి లేదు" అని చెప్పారు.
"నేను ఐదు .. ఆరు తరగతుల్లో ఉండగా అనుకుంటాను రామారావుగారిని ఒకసారి కలిశాను. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నారు. పురంధరేశ్వరిగారి అబ్బాయి .. నేను ఫ్రెండ్స్. తనతో కలిసి ఓ రోజు ఉదయాన్నే రామారావుగారి ఇంటికి వెళ్లాను. ఆయనతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసే అవకాశం లభించింది. తెలుగు సినిమాను గురించి ఏ దేశంలో మాట్లాడుతున్నా ఎన్టీఆర్ పేరు చెప్పకుండా ఉండలేము .. అది ఆయన గొప్పతనం" అంటూ చెప్పుకొచ్చారు.