NTR: మే 28 లోపు ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించండి: మురళీమోహన్
- హైదరాబాదులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమం
- హాజరైన పలువురు ప్రముఖులు
- ఎన్టీఆర్ ను వేనోళ్ల కీర్తించిన మురళీమోహన్, డి.రాజా
హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో సీనియర్ నటుడు మురళీమోహన్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన మురళీమోహన్ మాట్లాడుతూ, నటనలో ఎన్టీఆర్ ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. ఎన్టీఆర్ తనను ఎప్పుడూ తమ్ముడూ అని పిలిచేవారని మురళీమోహన్ గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ వంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జన్మదినం అయిన మే 28 లోపు ఆయనకు భారతరత్న ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ గొప్ప నటనతో ప్రజల మనసులు దోచుకున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని కొనియాడారు. ఎన్టీఆర్ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన రాజకీయ నేత అని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో ఆయన సంస్కరణలు తీసుకువచ్చారని, పేదల కష్టాలు తెలిసిన నిజమైన నాయకుడు ఎన్టీఆర్ అని అభివర్ణించారు. అందుకే ఎన్టీఆర్ ను అందరూ యుగ పురుషుడు అంటారని వెల్లడించారు. రాజకీయ నేతగా ఆయనకు ప్రత్యేక శైలి ఉందని, ఆయన దార్శనికుడు అని కీర్తించారు. ప్రాంతీయ పార్టీలకు గౌరవం, గుర్తింపు వచ్చాయంటే అది ఎన్టీఆర్ వల్లేనని డి.రాజా స్పష్టం చేశారు. ఆయన సామాజిక న్యాయం కోసం కృషి చేశారని తెలిపారు.