Andhra Pradesh: ఏపీకి చల్లని కబురు.. నేడు పలుచోట్ల వర్షాలు
- ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు
- ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం
- ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ఎండలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవ వచ్చని, పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. చెట్లకింద, ఆరుబయట ప్రదేశాల్లో ఉండొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది.
పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు ఛత్తీస్ గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. నేడు (ఆదివారం) అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ సూచించారు.