Palghar: తల్లి కష్టం చూడలేక బావి తవ్విన బాలుడు
- ఐదు రోజులు పొద్దస్తమానం తవ్వుతూనే ఉన్నాడన్న తల్లి
- మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా కెల్వెలో ఘటన
- చుట్టుపక్కల గ్రామాల్లో హీరోగా మారిన కుర్రాడు
నీటి కోసం నిత్యం తల్లి పడుతున్న కష్టాలను చూడలేక ఓ పద్నాలుగేళ్ల కుర్రాడు వయసుకు మించిన పని చేశాడు. ఐదు రోజుల పాటు పొద్దంతా కష్టపడి ఇంటి ఆవరణలోనే బావి తవ్వాడు. అందులో నీళ్లు పడడంతో తల్లి కష్టం తప్పించానని సంబరపడుతున్నాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉన్న ఓ మారుమూల గ్రామానికి చెందిన ప్రణవ్ రమేశ్ సాల్కర్ ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో హీరోగా మారాడు. పక్క గ్రామాలతో పాటు తనతో పాటు చదువుకుంటున్న స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు కూడా ప్రణవ్ తవ్విన బావిని చూడడానికి వస్తున్నారు.
మారుమూల ప్రాంతం కావడంతో కెల్వె గ్రామంలో సరైన నీటి వసతులు లేవు. దీంతో గ్రామంలోని మిగతా మహిళలతో పాటు ప్రణవ్ తల్లి కూడా దగ్గర్లోని నదికి వెళ్లి నీటిని మోసుకుని వస్తుంది. రోజూ ఉదయాన్నే తల్లి నీళ్లు మోసుకు రావడం చూసి ప్రణవ్ తమ గుడిసె పక్కనే బావిని తవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒక్కడే కష్టపడి తవ్వడం మొదలు పెట్టి, ఐదు రోజుల్లో పూర్తి చేశాడు. మధ్యాహ్నం భోజనానికి కేవలం పదిహేను నిమిషాలు పని ఆపేవాడని ప్రణవ్ తల్లి చెప్పారు.
బావిలో నీళ్లు పడడంతో అమ్మ కష్టాన్ని తప్పించానని ప్రణవ్ సంతోష పడుతున్నాడు. ఆదర్శ్ విద్యా మందిర్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రణవ్.. ఇప్పుడు స్కూలులో సెలబ్రిటీగా మారాడు. తన స్కూలు టీచర్ కూడా బావిని చూసేందుకు ఇల్లు వెతుక్కుంటూ వచ్చిందని ప్రణవ్ చెప్పాడు. ప్రణవ్ కష్టాన్ని సూచించేలా అతడి స్నేహితులు ఓ బోర్డు తయారుచేసి బావి ఒడ్డున పెట్టారు. పంచాయతి సమితి కూడా స్పందించి ప్రణవ్ ఇంట్లో నల్లా ఏర్పాటు చేశారు. ప్రణవ్ కు మరింత సాయం చేసేందుకు సమితి ముందుకు వచ్చింది.