Tammineni Sitaram: నువ్వేమైనా సీబీఐ చీఫ్ వా?.. నువ్వు అడిగితే చెప్పాలా?.. అవినాశ్ రెడ్డి వ్యవహారంపై ప్రశ్నించిన రిపోర్టర్ పై ఏపీ స్పీకర్ తమ్మినేని ఆగ్రహం
- అవినాశ్ రెడ్డి పారిపోతే సీబీఐ చూసుకుంటుందన్న తమ్మినేని సీతారాం
- నువ్వు ప్రశ్నించడానికీ లేదు.. నేను చెప్పడానికీ లేదంటూ రిపోర్టర్ పై సీరియస్
- ఆరోపణలు చేయడానికే ప్రతిపక్షాలు ఉన్నాయని మండిపాటు
ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యవహారంపై ప్రశ్నించిన మీడియాపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీకెందుకయ్యా?.. నీకేం పని? నువ్వేమైనా సీబీఐ చీఫ్ వా?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ఆరోపణలు చేయడానికే ప్రతిపక్షాలు ఉన్నాయని మండిపడ్డారు.
ఆదివారం శ్రీశైలం మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు వెళ్తున్న తనకు జన నాడి తెలుసని అన్నారు.
అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్రపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అవినాశ్ రెడ్డి పారిపోతే ఆయన్ను వెంబడించే బాధ్యత సీబీఐది. సీబీఐనే చూసుకుంటుంది. నీకు నాకు ఎందుకయ్యా? నీకేం పని దాంతో?’’ అని సీరియస్ అయ్యారు.
‘‘నువ్వు ప్రశ్నించడానికీ లేదు.. నేను చెప్పడానికీ లేదు.. అవినాశ్ పాత్రేంటి? ఏమిటనేది సీబీఐ చూసుకుంటుంది. అవినాశ్ చూసుకుంటారు. విచారణ జరుగుతోంది. నువ్వేమైనా సీబీఐ చీఫ్ వా? నీకు చెప్పాలా? మాకు అదే పనా?’’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆరోపణలు చేయడానికే ప్రతిపక్షాలు ఉన్నాయని, ఏదో ఒకటి అనకపోతే వాళ్లకు పూట ఎలా గడుస్తుందని ఎద్దేవా చేశారు.