Chandrababu: ఏపీ తాగునీటి సంక్షోభం దిశగా పయనిస్తోంది: చంద్రబాబు
- ఏపీలో జల్ జీవన్ పథకం అమలుపై చంద్రబాబు స్పందన
- జల్ జీవన్ పథకం అమలులో ఏపీ 18వ స్థానంలో ఉందని వెల్లడి
- స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఒక్కరి హక్కు అని ఉద్ఘాటన
- రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ కాలరాయలేరని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ తాగునీటి సంక్షోభం దిశగా పయనిస్తోందని తెలిపారు. జల్ జీవన్ పథకం అమలులో ఏపీ 18వ స్థానంలో ఉందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు ఇదొక ప్రబల నిదర్శనం అని చంద్రబాబు పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ పరిశుభ్రమైన తాగునీరు ఓ హక్కు అని, దీన్ని ఎవరూ కాలరాయలేరని స్పష్టం చేశారు. కానీ, ఏపీలో ప్రజలకు తాగునీరు వంటి ప్రాథమిక వసతిని కూడా అందించలేని అసమర్థ ప్రభుత్వాన్ని జగన్ నడిపిస్తున్నాడని చంద్రబాబు విమర్శించారు. ఏపీకి మెరుగైన నాయకత్వం అవసరం అని స్పష్టం చేశారు.