Sharmila: బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఊరికే అనలేదు: షర్మిల
- న్యాయవాది యుగేందర్ పై బీఆర్ఎస్ గూండాలు దాడి చేశారన్న షర్మిల
- యుగేందర్ పై దాడిని ఖండిస్తున్నామని ప్రకటన
- తీవ్రంగా దాడి చేసి బెదిరించడం బందిపోట్లకే సాధ్యమని వెల్లడి
న్యాయవాది యుగేందర్ పై దాడి నేపథ్యంలో, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణ అధికార పక్షంపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఊరికే అనలేదు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. నడిరోడ్డుపై దళిత న్యాయవాది కారు అద్దాలు పగులగొట్టి, రక్తం వచ్చేలా దాడి చేసి, చంపేస్తామంటూ బెదిరించడం బందిపోట్లకే సాధ్యమని షర్మిల మండిపడ్డారు.
దళిత బంధు అక్రమాలను ఎత్తిచూపిన న్యాయవాది యుగేందర్ పై బీఆర్ఎస్ గూండాల దాడిని వైఎస్సార్టీపీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. దళితులకు జరుగుతున్న అన్యాయంపై, దళితుల న్యాయమైన హక్కుల కోసం వైఎస్సార్టీపీ పోరాడుతుందని షర్మిల స్పష్టం చేశారు.
బందిపోట్ల రాష్ట్ర సమితి అంటే కేసీఆర్ తనపై హుటాహుటీన కేసు నమోదు చేయించారని, కానీ దళిత న్యాయవాదిపై దాడికి దిగిన బీఆర్ఎస్ బందిపోట్లకు మాత్రం గొడుగుపడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం నుంచి దళిత బంధు వరకు అన్ని రకాలుగా మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
"కేసీఆర్ సొంత రాజ్యంలో ప్రతిపక్షాలకు పోరాడే హక్కు లేదు, మీడియాకు ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, ప్రజలకు న్యాయం లేదు, న్యాయవాదులకు రక్షణ లేదు, బందిపోట్ల దాష్టీకాలకు అడ్డుఅదుపు లేదు. అందుకే అన్నాం... టీఆర్ఎస్ అంటే తాలిబన్ల రాష్ట్ర సమితి అని, బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని" అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.