SRH: సన్ రైజర్స్ గెలిస్తే ముంబయి ఇండియన్స్ కొంప కొల్లేరు!
- ఐపీఎల్ లీగ్ దశ పోటీలకు నేటితో తెర
- నేడు డబుల్ హెడర్
- తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ × ముంబయి ఇండియన్స్
- రెండో మ్యాచ్ లో ఆర్సీబీ × గుజరాత్ టైటాన్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
ఐపీఎల్ తాజా సీజన్ లో లీగ్ దశ పోటీలకు నేటితో తెరపడనుంది. నేడు డబుల్ హెడర్ లో భాగంగా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే రెండో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి.
కాగా, ఐపీఎల్-16లో మూడు ప్లే ఆఫ్ బెర్తులు ఇప్పటికీకే భర్తీ అయ్యాయి. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ప్లే ఆఫ్ దశలో అడుగుపెట్టాయి. ఇప్పుడు నాలుగో బెర్తు కోసం ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ నెలకొంది. ఈ మూడు జట్ల ఖాతాలో 14 చొప్పున పాయింట్లు ఉన్నాయి.
రాజస్థాన్ ఇప్పటికే లీగ్ మ్యాచ్ లు అన్నీ ఆడేయగా, ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు తమ చివరి మ్యాచ్ లు ఆడుతున్నాయి. ఇవాళ్టి మ్యాచ్ ల్లో ముంబయి, బెంగళూరు రెండు జట్లు గెలిస్తే మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు ప్లే ఆఫ్ లోకి వెళుతుంది.
ఒకవేళ, ముంబయి గెలిచి బెంగళూరు ఓడితే... ముంబయి ప్లే ఆఫ్ చేరుతుంది. బెంగళూరు గెలిచి ముంబయి ఓడితే... బెంగళూరు ప్లే ఆఫ్ లో ప్రవేశిస్తుంది. అలాకాకుండా... బెంగళూరు, ముంబయి జట్లు ఓడిపోతే రాజస్థాన్ రాయల్స్ కు కూడా అవకాశం ఉంటుంది. ఈ మూడు జట్లలో మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు ప్లే ఆఫ్ బెర్తును చేజిక్కించుకుంటుంది.
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ విషయానికొస్తే... సన్ రైజర్స్ ఈ టోర్నీ నుంచి ఎప్పుడో నిష్క్రమించింది. ఆ జట్టుకు నేటి మ్యాచ్ లో ఓడినా పోయేదేం లేదు. సన్ రైజర్స్ గెలిస్తే మాత్రం ముంబయి ఇండియన్స్ కొంప ముంచిన జట్టుగా నిలిచిపోతుంది! ముంబయి ఈ మ్యాచ్ ఓడితే, అప్పుడు నేటి రెండో మ్యాచ్ ఫలితం కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్ లో బెంగళూరు గెలిస్తే ముంబయి ఇక ఇంటికే!
ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబయి ఇండియన్స్... సన్ రైజర్స్ తో మ్యాచ్ ను చావోరేవో అన్నట్టుగా చూస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులను రంగంలోకి దింపుతోంది. ప్రస్తుత ఫాం చూస్తే ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సన్ రైజర్స్ లో నిలకడ లోపించిందన్న విషయం గత మ్యాచ్ ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ సొంతగడ్డ వాంఖెడే స్టేడియంలో జరగనుండడం రోహిత్ సేనకు కలిసొచ్చే అంశం.