Rajamouli: భారత్ లో ఆర్చరీ ఆదరణ పొందుతుండడం సంతోషం కలిగిస్తోంది: ఎస్ఎస్ రాజమౌళి
- షాంఘైలో వరల్డ్ కప్ ఆర్చరీ
- పురుషుల కాంపౌండ్ అంశంలో ప్రథమేశ్ కు స్వర్ణం
- వరల్డ్ నెంబర్ వన్ ఆర్చర్ ను ఓడించిన భారత టీనేజ్ సంచలనం
- అభినందనలు తెలిపిన రాజమౌళి
చైనాలోని షాంఘై నగరంలో నిర్వహించిన వరల్డ్ కప్ స్టేజ్-2 ఆర్చరీ చాంపియన్ షిప్ లో భారత టీనేజ్ సంచలనం ప్రథమేశ్ సమాధాన్ జవకర్ (19) పసిడి కొల్లగొట్టాడు.
శనివారం జరిగిన పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో వరల్డ్ నెంబర్ వన్ మైక్ స్కోలెస్సర్ కు షాకిచ్చిన ప్రథమేశ్ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించాడు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోరులో ప్రథమేశ్ 149-148తో నెదర్లాండ్స్ ఆర్చర్ ను ఓడించాడు.
దీనిపై టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. భారత్ లో ఆర్చరీకి ఆదరణ పెరుగుతుడడం చూస్తుంటే హృదయం ఉప్పొంగుతోందని పేర్కొన్నారు. ప్రథమేశ్ సమాధాన్ జవకర్ అద్భుతమైన నైపుణ్యంతో వెలుగులోకి వచ్చాడని రాజమౌళి కొనియాడారు. షాంఘైలో జరిగిన వరల్డ్ కప్ లో స్వర్ణం గెలిచిన ప్రథమేశ్ కు శుభాభినందనలు అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. అంతేకాదు, ప్రథమేశ్ పసిడి ప్రదర్శన వీడియోను కూడా రాజమౌళి పంచుకున్నారు.
.