Prathipati Pulla Rao: లోకేశ్ పై కక్ష సాధించాలనే రాజధానిలో ఇతరులకు ఇళ్ల స్థలాలు: ప్రత్తిపాటి పుల్లారావు
- పేదలకు 3 సెంట్లు ఇవ్వాలని తామే ప్రతిపాదించామన్న ప్రత్తిపాటి
- మంత్రులు నిజాలు తెలుసుకోవాలని హితవు
- చంద్రబాబును విమర్శించే అర్హత మంత్రి రజనీకి లేదని స్పష్టీకరణ
అమరావతిలో పేదలకు 3 సెంట్లు ఇవ్వాలని తామే ప్రతిపాదించామని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. సెంటు స్థలంపై రాద్ధాంతం చేసే మంత్రులు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. లోకేశ్ పై కక్ష సాధించాలన్న ఉద్దేశంతోనే రాజధానిలో ఇతరులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని ప్రత్తిపాటి ఆరోపించారు.
అటు, ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీపైనా ప్రత్తిపాటి ధ్వజమెత్తారు. చంద్రబాబును విమర్శించే అర్హత మంత్రి రజనీకి లేదని స్పష్టం చేశారు. చిలకలూరిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైద్యశాఖ నిర్వహణలో మంత్రి విడదల రజని విఫలమయ్యారని విమర్శించారు.
వంద పడకల ఆసుపత్రి సెల్ఫీ చాలెంజ్ పై మంత్రి స్పందించలేదని అన్నారు. వంద పడకల ఆసుపత్రి ఎప్పుడు పూర్తవుతుందో మంత్రి చెప్పగలరా? అని నిలదీశారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం దారుణంగా విఫలమైందని ప్రత్తిపాటి పేర్కొన్నారు.
ఇక, చిలకలూరిపేటలో ఎన్టీఆర్ ట్రస్ట్ పథకం ద్వారా నీటి సరఫరా చేయాలని, లేదంటే మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యాదీవెన అందించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.