2k note: రూ.2 వేల నోట్లతో పన్ను బకాయిలు చెల్లించిన బస్సు ఓనర్
- ఆర్బీఐ ప్రకటనతో పెద్ద నోటుతో రూ.4 లక్షల ఫైన్ చెల్లింపు
- గుజరాత్ లోని సూరత్ జిల్లాలో సంఘటన
- రూ.2 వేల నోటుతో రైల్వే రిజర్వేషన్లు చేయించుకుంటున్న ప్రయాణికులు
అద్దెకు తిప్పుతున్న బస్సుపై పన్ను బకాయిలు పేరుకుపోయాయి.. ఆర్టీఏ అధికారులు దానిని సీజ్ చేసి తీసుకెళ్లారు. అయినా స్పందించని యజమాని తాజాగా పన్ను మొత్తం చెల్లించి బస్సును తీసుకెళ్లాడు. అందులో నాలుగు లక్షలు రూ.2 వేల నోట్లే కావడం విశేషం! గుజరాత్ లోని సూరత్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సూరత్ జిల్లాకు చెందిన ఓ ట్రావెల్స్ యజమాని బస్సును ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఏడాది పన్ను బకాయిలు రూ.6 లక్షల దాకా చెల్లించకపోవడంతో బస్సును తీసుకెళ్లారు. నెలలు గడుస్తున్నా బస్సు యజమాని మాత్రం స్పందించలేదు. రూ.2 వేల నోటను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేసిన తాజా ప్రకటనతో బస్సు ఓనర్ అలర్ట్ అయ్యాడు. శనివారం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి రూ.4 లక్షల విలువైన 2 వేల నోట్లు, మిగతా రూ.2 లక్షలు ఇతర నోట్లతో పన్ను చెల్లించాడు.
ఇక, ఆర్బీఐ ప్రకటనతో జనం తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను వదిలించుకునేందుకు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. సూరత్ రైల్వే స్టేషన్ లో రెండు మూడు రోజులుగా రిజర్వేషన్ కౌంటర్ వద్ద రద్దీ పెరిగిందని అధికారులు చెప్పారు. సాధారణం కంటే రెట్టింపు సంఖ్యలో రిజర్వేషన్లు చేస్తున్నామని, ప్రయాణికులలో ఎక్కువ మంది రూ.2 వేల నోట్లే ఇస్తున్నారని తెలిపారు.