Bonda Uma: వైఎస్ అవినాశ్ తల్లికి నిజంగా అనారోగ్యం ఉంటే హైదరాబాద్ లోని అపోలో వంటి ఆసుపత్రికి తీసుకెళ్తారు: బొండా ఉమా
- అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు డీజీపీ, ఎస్పీ సహకరించడం లేదన్న బొండా ఉమా
- వివేకా హత్య కేసులో నిందితుడిని పోలీసులు కాపాడటమా? అని ప్రశ్న
- తాడేపల్లి నుంచి వస్తున్న ఆదేశాలను ఎస్పీ పాటిస్తున్నారని విమర్శ
ఏపీ డీజీపీ, కర్నూలు జిల్లా ఎస్పీలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా విమర్శలు గుప్పించారు. వైఎస్ వివేకా హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు వీరు సహకరించడం లేదని ఆయన మండిపడ్డారు. వివేకా హత్య కేసులో నిందితుడిని పోలీసులు కాపాడటమా? అని ప్రశ్నించిన ఆయన... రాష్ట్ర పోలీసులకు ఇంతకన్నా అవమానం మరొకటి లేదని అన్నారు. తాడేపల్లి నుంచి వస్తున్న ఆదేశాలను ఎస్పీ పాటిస్తున్నారని ఆరోపించారు.
డీజీపీ, డీఐజీ వెంటనే కలగజేసుకుని అవినాశ్ రెడ్డిని సీబీఐకి అప్పగించాలని బొండా ఉమా డిమాండ్ చేశారు. పులివెందుల, కడప నుంచి వచ్చిన కిరాయిమూకల అధీనంలో కర్నూలు ఆసుపత్రి ఉందని, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిజంగా అవినాశ్ రెడ్డి తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే హైదరాబాద్ లోని అపోలో వంటి ఆసుపత్రికి తీసుకెళ్తారని, కర్నూలు ఆసుపత్రిలో ఉంచరని అన్నారు.