Kerala: కేరళలో కిలోమీటరు దూరం వెనక్కి నడిచిన రైలు.. ఎందుకంటే!
- చెరియనాడ్ స్టేషన్ లో రైలును ఆపకుండా తీసుకెళ్లిన లోకో పైలట్
- చిన్న స్టేషన్ కావడం, సిగ్నల్ లోపం వల్లేనని రైల్వే అధికారుల వివరణ
- లోకో పైలట్లకు నోటీసులు జారీ చేసిన ఉన్నతాధికారులు
కేరళలోని చెరియనాడ్ గ్రామంలో ఆదివారం ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఈ ఊరిలో ఉన్న రైల్వే స్టేషన్ దీనికి వేదికయ్యింది. ఓ ఎక్స్ ప్రెస్ రైలు ఈ స్టేషన్ లో ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో సదరు రైలు ఎక్కాల్సిన ప్రయాణికులతో పాటు ఆ స్టేషన్ లో దిగాల్సిన ప్యాసెంజర్లు గగ్గోలు పెట్టారు. అయితే, కాసేపటికి అదే ట్రైన్ వెనక్కి వచ్చి స్టేషన్ లో ఆగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..
త్రివేండ్రం- షోరనూర్ మధ్య నడిచే వేనాడ్ ఎక్స్ ప్రెస్ ఆదివారం చెరియనాడ్ స్టేషన్ లో ఆగకుండా వెళ్లిపోయింది. స్టేషన్ లో ట్రైన్ ఆగకపోవడంతో మేనేజర్ లోకో పైలట్ ను అప్రమత్తం చేశారు. దీంతో బ్రేక్ లు అప్లయ్ చేసినా.. ట్రైన్ దాదాపు కిలోమీటరు దూరం వెళ్లాకే ఆగింది. అటు రైల్వే స్టేషన్ లో, ఇటు రైలులో ప్రయాణికులు ఆందోళన చేయడంతో రైలును వెనక్కి నడిపించి స్టేషన్ కు తీసుకొచ్చారు.
చిన్న స్టేషన్ కావడం, కమ్యూనికేషన్ లోపం వల్లే ట్రైన్ ఆగకుండా వెళ్లిందని అధికారులు తేల్చారు. అయితే, ఇదేమంత పెద్ద విషయం కాదని వివరించారు. స్టేషన్ లో ట్రైన్ ఆపకపోవడానికి కారణం ఏంటనేది విచారిస్తామని, లోకో పైలట్లను వివరణ కోరతామని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.