BBC: బీబీసీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు!
- ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో రెండు పార్టులుగా డాక్యుమెంటరీ రూపొందించిన బీబీసీ
- డాక్యుమెంటరీతో దేశం పరువు తీశారంటూ ఓ ఎన్జీవో పిటిషన్
- వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ బీబీసీకి హైకోర్టు నోటీసులు
బీబీసీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో రెండు పార్టులుగా రూపొందించిన డాక్యుమెంటరీని ప్రసారం చేసిన అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. డాక్యుమెంటరీతో దేశం పరువు తీశారంటూ బీబీసీపై గుజరాత్‌కు చెందిన ఎన్జీవో సంస్థ ‘జస్టిస్ ఫర్ ట్రయల్’ పరువునష్టం కేసును దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ సచిన్ దత్త.. వివరణ ఇవ్వాలంటూ ఈ రోజు బీబీసీకి నోటీసులు ఇచ్చారు.
బీబీసీ ఇండియా స్థానిక ఆపరేటర్ అని, బీబీసీ యూకే ఆ డాక్యుమెంటరీని రిలీజ్ చేసినట్లు పరువునష్టం దావాలో తెలిపారు. ఎన్జీవో తరపున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. దేశం ప్రతిష్ఠను దెబ్బతీసేలా, న్యాయవ్యవస్థను కించపరిచేలా ఆ డాక్యుమెంటరీ ఉన్నట్లు దావాలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 15వ తేదీన తదుపరి విచారణ చేపట్టనున్నారు.