Chintakayala Vijay: తమ్ముడు అరెస్ట్ కాకుండా అడ్డుపడటం వెనకున్న రహస్యం ఏమిటో జగన్ బయటపెట్టాలి: చింతకాయల విజయ్
- వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాశ్
- అవినాశ్ అరెస్ట్ కాకుండా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్న చింతకాయల విజయ్
- జగన్ ఎందుకింత దిగజారుతున్నారో చెప్పాలని డిమాండ్
- ఈ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కాపాడటం కోసం సీఎం జగన్ రాజ్యాంగాన్నే దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ విమర్శించారు. ముఖ్యమంత్రి చర్యల్లో ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ప్రమాదం కనిపిస్తోందని అన్నారు.
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, తమ్ముడు అరెస్ట్ కాకుండా అడ్డుపడటం వెనకున్న చిదంబర రహస్యం ఏమిటో జగన్ బయటపెట్టాలని విజయ్ డిమాండ్ చేశారు. జగన్ తన తండ్రి కుటుంబాన్ని, తల్లిని, చెల్లిని పక్కనపెట్టి మరీ అవినాశ్ రెడ్డిని కాపాడటానికి ఎందుకు ఇంతలా దిగజారుతున్నాడు? అని ప్రశ్నించారు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ అయితే, తర్వాత ఎవరిగుట్టు బయట పడుతుందో ముఖ్యమంత్రికి తెలిసే, ఆయన ఢిల్లీ వెళ్లి మరీ కజిన్ బ్రదర్ ని కాపాడుకునే ప్రయత్నం చేశారా? అని నిలదీశారు.
"మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ ఆలోచనలే జగన్ కూడా చేస్తున్నాడు. కొలంబియాలో ఉండే డాన్ ఫ్లాబ్లో ఎస్కోబార్ తనకు శిక్ష వేస్తారన్న భయంతో, ఆఖరికి కోర్టునే బాంబులతో పేల్చేశాడు. శిక్ష వేసే సమయం రాగానే నా జైలు నేను కట్టుకుంటానంటూ బరితెగించాడు. అలాంటి వ్యక్తి తరహాలోనే జగన్ కూడా ఆలోచిస్తున్నాడు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ కు అడ్డు తగులుతున్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల తీరుపై సీబీఐ గవర్నర్ కు ఫిర్యాదు చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై వెంటనే గవర్నర్ జోక్యం చేసుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించాలి" అని చింతకాయల విజయ్ విజ్ఞప్తి చేశారు.
మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందా? దాన్ని పరిష్కరించడం పోలీసులు, ముఖ్యమంత్రి వల్ల కాదా? అని నిలదీశారు. అవినాశ్ రెడ్డి చెప్పేది వింటూ, జగన్ చేసేది చూస్తూ కూర్చుంటే దేశంలో క్రిమినల్స్ ను శిక్షించడం సీబీఐ వల్ల అవుతుందా? అని వ్యాఖ్యానించారు.
"మాజీ మంత్రులు నారాయణ, రవీంద్రలను అరెస్ట్ చేసినప్పుడు ఇలాంటి కుంటి సాకులు ఎందుకు చెప్పలేదు? గతంలో నన్ను అరెస్ట్ చేయడానికి సీఐడీ అత్యుత్సాహంతో వ్యవహరించలేదా? నేను లేని సమయంలో నా ఇంటిపైకి సీఐడీ అధికారుల్ని పంపి, 5 ఏళ్ల వయసున్న నా కూతుర్ని విచారించి భయభ్రాంతులకు గురిచేశారు. ఇంటి గోడలు దూకి మరీ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు రాని శాంతిభద్రతల సమస్య, అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వస్తుందా?" అంటూ విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"80 ఏళ్ల వయసులో ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు జగన్ రెడ్డి పెట్టిన తప్పుడు కేసులు విచారిస్తున్న సీఐడీ విచారణకు సహకరించారు. అలాంటి వ్యక్తే నిర్భయంగా బయటకు వచ్చినప్పుడు ఈ తప్పుడు ముఖ్యమంత్రి, హత్య కేసులో నిందితుడైన అవినాశ్ రెడ్డి ఎందుకు బయటకురారు?" అని నిలదీశారు.