Nara Lokesh: ​రేపు కడప జిల్లాలో ప్రవేశించనున్న లోకేశ్ పాదయాత్ర

Nara Lokesh Yuvagalam Padayatra will enter into Kadapa district tomorrow

  • నేడు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • ముగిసిన 107వ రోజు పాదయాత్ర
  • బలిజలతో లోకేశ్ ముఖాముఖి
  • జగన్ పాలనలో బలిజలు కూడా బాధితులేనన్న లోకేశ్
  • జగన్ కాపు పథకాలన్నీ రద్దు చేశాడని వ్యాఖ్యలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 107వ రోజు ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా యువనేతను చూసేందుకు . పాదయాత్రకు బయలుదేరే ముందు దొర్నిపాడులో బలిజ సామాజికవర్గీయులతో సమావేశమైన లోకేశ్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. 

అనంతరం ప్రారంభమైన పాదయాత్ర దొర్నిపాడు, రామచంద్రపురం, భాగ్యనగరం, చింతకుంట మీదుగా ఆళ్లగడ్డ శివారు విడిది కేంద్రానికి చేరుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40 రోజుల పాటు దుమ్ము రేపిన యువగళం పాదయాత్ర... మంగళవారం జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లె వద్ద కడప జిల్లాలోకి ప్రవేశించనుంది.

జగన్ పాలనలో బలిజలూ బాధితులే!

జగన్ పాలనలో బలిజలు బాధితులుగా మారారని, తన పిల్లలు విదేశాల్లో చదివితే చాలు, పేద విద్యార్థులు విదేశాల్లో చదవకూడదు అనే దుర్మార్గపు ఆలోచనతో జగన్ విదేశీ విద్య పథకం రద్దు చేశారని లోకేశ్ విమర్శించారు. దొర్నిపాడు క్యాంప్ సైట్ వద్ద బలిజ సామాజికవర్గం ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... విద్యా, ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ మేరకు గతంలో 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని వెల్లడించారు. జగన్ వచ్చిన వెంటనే కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లు కట్ చేశాడని ఆరోపించారు. 

"గతంలో కాపులకు అమలు చేసిన రిజర్వేషన్లకు మేము కట్టుబడి ఉన్నాం. జగన్ కక్షతో కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారు. జగన్ రెడ్డి రాజంపేట ఎంపీ సీటును మిథున్ రెడ్డికి కట్టబెట్టి బలిజలను వంచించారు. తిరుపతి అసెంబ్లీ సీటును తెలుగుదేశం పార్టీ బలిజలకు కేటాయిస్తే, జగన్ రెడ్డి సొంత వర్గానికి కట్టబెట్టాడు. 

టీడీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రి పదవిని కాపులకిచ్చాం. బలిజ వర్గానికి చెందిన సి.రామచంద్రయ్యకు రెండుసార్లు రాజ్యసభ్యుడిగా అవకాశం కల్పించాం. పసుపులేటి బ్రహ్మయ్యకు మంత్రి పదవి ఇచ్చాం. చదలవాడ కృష్ణమూర్తిని టీటీడీ ఛైర్మన్ గా నియమించాం. బి.కె.సత్యప్రభకు ఎమ్మెల్యే సీటు ఇచ్చాం, ఆమె భర్త ఆదికేశవులు నాయుడుని ఎంపీని చేశాం" అని వివరించారు.

కాపుల పథకాలన్నీ రద్దు చేశాడు!

కాపులకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలైన అన్ని పథకాలు జగన్ రద్దు చేశారని లోకేశ్ ఆరోపించారు. కాపు నేస్తం అంటూ.. అన్ని వర్గాల్లోని మహిళలకు ఇచ్చే పథకాన్నే కాపులకు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు చెబుతున్నారని విమర్శించారు. 

"గతంలో కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ.3100 కోట్లు ఖర్చు చేశాం. ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథకం ద్వారా 4,528 మంది కాపు విద్యార్ధుల్ని విదేశాల్లో చదివించాం. ఎన్టీఆర్‌ ఉన్నత విద్యా పథకం ద్వారా రూ.28.26 కోట్లతో 1,413 మంది విద్యార్ధులకు లబ్ది చేకూర్చాం. కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ.66.50 కోట్లు రుణాలుగా ఇచ్చాం. 33,594 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చాం. ప్రతి జిల్లాలో రూ.5 కోట్లతో కాపు భవన్‌లను నిర్మించాం. 

కాపు కార్పొరేషన్‌ రుణాలకు చేసుకున్న 47 వేలకు పైగా దరఖాస్తులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. కాపులకు కల్పించిన రిజర్వేషన్‌ను రద్దు చేయడం ద్వారా ఉద్యోగాలు కోల్పోయారు. స్కూళ్లు, కాలేజీల్లో రిజర్వేషన్ల ప్రాతిపదికన అందించే వేలాది సీట్లు కాపు విద్యార్ధులు కోల్పోయారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపు భవన్స్ నిర్మాణానికి రూ.165 కోట్లు కేటాయిస్తే... జగన్ రెడ్డి ఆ నిర్మాణాలను సైతం పూర్తి చేయకుండా ఆపేశాడు. 

రైతు భరోసా పథకాన్ని కాపులకు దూరం చేసి, రైతుల్ని కూడా కులాల వారీగా విడగొట్టారు. జగన్ కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదు. కాపులను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలు చేసిన విదేశీ విద్య పథకం, నిరుద్యోగ భృతి మళ్లీ ప్రారంభిస్తాం" అని లోకేశ్ భరోసా ఇచ్చారు.

*యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1378.1 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 14.5 కి.మీ.*

*108వ రోజు (23-5-2023) పాదయాత్ర వివరాలు:*

*ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాల జిల్లా)*

సాయంత్రం

4.00 – ఆళ్లగడ్డ శివారు అపర్ణ ఇన్ ఫ్రా వద్ద క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.20 – భూమా బాలిరెడ్డి నగర్ లో బుడగజంగాలతో సమావేశం.

4.50 – ఆళ్లగడ్డ 4రోడ్ల సర్కిల్ లో స్థానికులతో మాటామంతీ.

5.10 – గవర్నమెంట్ కాలేజి వద్ద వాల్మీకి బోయలతో సమావేశం.

5.15 – సిఎస్ఐ చర్చి వద్ద క్రిస్టియన్లతో సమావేశం.

5.20 – పాతబస్టాండు వద్ద బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

6.50 – భూమా ఘాట్ సందర్శన, దివంగత భూమా నాగిరెడ్డి దంపతులకు నివాళులు.

8.00 – చిన్నకందుకూరులో స్థానికులతో సమావేశం.

8.05 – సుద్దపల్లె వద్ద కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోకి ప్రవేశం.

8.35 – సుద్దపల్లెలో స్థానికులతో సమావేశం.

9.35 – సుద్దపల్లె శివారు విడిది కేంద్రంలో బస.

******


  • Loading...

More Telugu News