Andhra Pradesh: ఏపీపై కేంద్రం కరుణ.. 2014-15 రెవెన్యూ లోటు కింద ఒకేసారి రూ.10,461 కోట్ల నిధుల మంజూరు
- ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద నిధుల మంజూరు
- ప్రకటించిన ఆర్థిక శాఖ డైరెక్టర్ మహేంద్ర చండేలియా
- రెవెన్యూ లోటు భర్తీ చేయాలంటూ 2014 నుంచి ఏపీ ప్రభుత్వం అభ్యర్థన
- ఇన్నాళ్లుగా కొర్రీలు వేస్తూ వచ్చిన కేంద్రం అకస్మాత్తుగా నిధుల విడుదల
నిధులు సరిపోక అల్లాడుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. 2014-15 నాటి రెవెన్యూ లోటు భర్తీకి ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద రూ.10,460.87 కోట్లను ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 19న కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి విడతల వారీగా నిధులను విడుదల చేస్తూ వచ్చిన కేంద్రం తొలిసారిగా ఇన్ని నిధులను ఏకమొత్తంలో విడుదల చేసింది. ఎన్నికల ఏడాదిలో ఈ మొత్తాన్ని విడుదల చేయడం విశేషం.
2014లో రాష్ట్ర విభజన తరువాత రెవెన్యూలోటు భర్తీ కోసం అప్పట్లో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో కొంత మొత్తాన్ని విడుదల చేసిన కేంద్రం మిగిలిన సొమ్ముకు కొర్రీలు వేసింది. వాస్తవానికి విభజన తేదీ నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే మధ్య కాలంలో 2014-15 కాలానికి రిసోర్సెస్ గ్యాప్‌కు సంబంధించి కేంద్ర బడ్జెట్లో పరిహారం చెల్లించాలి. దీంతో, 2014-15 కాలానికి రాష్ట్రంలో రెవెన్యూలోటును రూ.16,078 కోట్లుగా తేల్చారు.
ఈ క్రమంలో కేంద్రం 2014లో తొలి విడతగా రూ.2303 కోట్లు విడుదల చేసింది. ఆ తరువాత 2015లో మరో రూ. 500 కోట్లు, 2016లో రూ.1176.50 కోట్లు వెరసి మొత్తం రూ.3979.50 కోట్లు ఇచ్చింది. మిగతా మొత్తాన్ని 2016లో విడుదల చేస్తామని చెప్పిన కేంద్రం, ఇంకా రూ.139.39 కోట్లు మాత్రమే ఇవ్వాలని ఆ తరువాత వెల్లడించింది. మిగిలిన మొత్తాన్ని కొత్త పథకాల కోసం ఖర్చు చేశామని 2017 మేలో అప్పటి ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
2018లో ఈ విషయమై కేంద్రంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరిపారు. కాగ్ ధ్రువీకరణ ఆధారంగా రెవెన్యూ లోటును రూ. 16,078 కోట్లుగా పరిగణించాలన్నారు. 2014-15 నాటికి బిల్లులు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కానీ, అప్పట్లో కేంద్రం ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రం ప్రభుత్వం పలు దఫాలుగా వినతిపత్రాలు సమర్పించినా స్పందన కరవైంది.
అయితే, ఈ ఏడాది మార్చిలో కేంద్రం రెవెన్యూ లోటుకు సంబంధించి రాష్ట్రం నుంచి వివరాలు కోరింది. 2014-15, అంతకుముందు కాలానికి సంబంధించి ఏయే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి? వాటిల్లో చెల్లించాల్సిన బిల్లులు ఏవి? తదితర వివరాలతో ఆధారాలతో సహా పంపాలని కోరింది. ఆ తరువాత ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద సుమారు రూ.10,461 కోట్లను విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.