Reliance: రిలయన్స్ జియో మార్ట్ లో భారీగా ఉద్యోగుల తొలగింపులు
- 1,000 మందిని రాజీనామా కోరిన సంస్థ
- రానున్న వారాల్లో మరో 9,900 మందిని సాగనంపే ప్రణాళిక
- లాభాలు పెంచుకునేందుకు పలు సంస్కరణల చర్యలు
ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించే సంస్థల్లో రిలయన్స్ జియో మార్ట్ కూడా చేరిపోయింది. ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అయిన జియో మార్ట్ 1,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతోంది. అంతేకాదు, రానున్న వారాల్లో మరో 9,900 మంది ఉద్యోగులను తొలగించనుంది. దీనికి కారణం ఏంటని పరిశీలిస్తే.. లాభాలు పెంచుకునేందుకు జియోమార్ట్ ఈ కార్యక్రమానికి తెరతీసింది. ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా లాభాలు పెంచుకోవడంపై సంస్థ ప్రస్తుతం దృష్టి సారించింది.
కార్పొరేట్ ఆఫీస్ లో 500 మందిని, క్షేత్రస్థాయిలో మరో 500 మందిని రాజీనామా చేయాలని జియో మార్ట్ కోరినట్టు ఎకనమిక్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. గడిచిన కొన్నిరోజుల్లో వీరిని రాజీనామా చేయాలని కోరినట్టు పేర్కొంది. పనితీరు మెరుగుపరుచుకోవాలనే ప్రణాళిక కార్యక్రమం కింద మరింత మంది ఉద్యోగులను చేర్చినట్టు సమాచారం. లాభాలు పెంచుకోవడంలో భాగంగా సగం మేర ఫుల్ ఫిల్ మెంట్ కేంద్రాలను మూసివేయనుంది. స్థానిక స్టోర్లకు ఫుల్ ఫిల్ మెంట్ కేంద్రాల నుంచే ఉత్పత్తులను సరఫరా చేస్తుంటుంది. రిలయన్స్ రిటైల్ ఇటీవలే 344 మిలియన్ డాలర్లతో మెట్రో ఏజీ హోల్ సేల్ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. తాజా సంస్కరణల వెనుక ఇది కూడా ఒక కారణమేనని తెలుస్తోంది. మెట్రో ఏజీ కార్యకలాపాలను రిలయన్స్ రిటైల్ తో అనుసంధానించే క్రమంలో అదనంగా ఉన్న ఉద్యోగులను తొలగించడం కూడా ఇందులో భాగంగా ఉంది.