YS Avinash Reddy: రేపటి వరకు అవినాశ్‌రెడ్డి అరెస్టు కాకుండా జగన్ చూసుకుంటున్నారు: మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి
- జగన్, అవినాశ్‌రెడ్డి అక్రమ సంపాదన రూ.2,000 నోట్ల రూపంలో భద్రపరిచారన్న బీటెక్ రవి
- లాకర్‌లో ఉన్న ఆ సొమ్ము తెరుచుకోవాలంటే అవినాశ్‌రెడ్డి వేలిముద్రలు అవసరమన్న టీడీపీ నేత
- 25న సీబీఐకి కొత్త చీఫ్ వస్తున్నారని వ్యాఖ్య
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డి అక్రమ సంపాదన రూ. 2,000 నోట్ల రూపంలో లాకర్లలో భద్రపరిచినట్టు తనకు సమాచారం ఉందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. లాకర్లు తెరుచుకోవాలంటే అవినాశ్‌రెడ్డి వేలిముద్రలు అవసరమని పేర్కొన్నారు. వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్‌రెడ్డి అరెస్ట్ అయితే ఆ డబ్బును మార్చుకోలేమన్న భయం వారిలో ఉందని అన్నారు.
నిన్న కడపలో విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేస్తే వైసీపీకి తీరని నష్టం జరుగుతుందని అన్నారు. కాబట్టి ఈ నెల 25 వరకు అరెస్టు కాకుండా చూసుకోవాలనే ముఖ్యమంత్రి నాటకాలు ఆడిస్తున్నారని అన్నారు. ఆ రోజున సీబీఐకి కొత్త డైరెక్టర్ వస్తున్నారని, ఆయన తమకు అనుకూలంగా వ్యవహరిస్తారన్న ప్రచారం పులివెందులలో జోరుగా సాగుతోందని అన్నారు. అవినాశ్‌రెడ్డి గతంలో విచారణకు హాజరైనప్పుడు తాడేపల్లికి చెందిన పేర్లు వెల్లడించారని, ఇప్పుడు ఆయన అరెస్ట్ అయితే ఇబ్బందులు తప్పవని జగన్ భయపడుతున్నారని బీటెక్ రవి పేర్కొన్నారు.